ఒక వైపు స్థానిక సంస్థల ఎన్నికల హోరు…మరో వైపు ఉద్యమాల హోరు రాష్ట్రాన్ని ఊపేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి వీలు లేదని అధికార వైకాపా పార్టీ ఎన్ని అభ్యంతరాలు పెట్టినా..కోర్టులు చుట్టూ తిరిగినా..’నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌’ ఎన్నికలను జరిపిస్తున్నారు. ఇప్పటికే పంచాయితీ ఎన్నికల మూడవ దశ ముగియగా…నగర కార్పొరేషన్లకు, మున్సిపాల్టీల ఎన్నికల షెడ్యూల్‌ను ‘నిమ్మగడ్డ’ ప్రకటించారు. ఇక నేడో రేపో ‘జెడ్‌పిటీసీ, ఎంపిటీసీ’ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎన్నికల్లో అధికార వైకాపా ఎక్కువ స్థానాలు గెలుచుకున్నా..ప్రధాన ప్రతిక్షమైన టిడిపి అధికారపార్టీకి గట్టిపోటీనే ఇస్తోందని వస్తోన్న ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మూడు దశల్లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో టిడిపి మద్దతు దారులు భారీ సంఖ్యలో గెలవడం విశేషం. అధికారపార్టీ అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలతోపాటు, వారి బెదిరింపులు, సొమ్ములను, అధికార పరపతిని తట్టుకుని టిడిపి ఈస్థాయిలో స్థానికంగా నిలబడడం గొప్ప విషయమే.

ఇది ఇలా ఉంటే మరో వైపు ‘విశాఖ’లో ఉక్కుఉద్యమం జోరుగా సాగుతోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రవేట్‌పరం చేస్తామని కేంద్రం ప్రకటించడంతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఆందోళన బాట పడుతున్నారు. టిడిపితో పాటు ప్రధాన ప్రతిపక్షాలు పోరాటంలో పాల్గొంటుండగా…అధికార వైకాపా కూడా తాము కూడా ఆందోళనలో పాల్గొంటున్నామని చెబుతోంది. అయితే టిడిపి మాజీ ఎమ్మెల్యే ‘పల్లా శ్రీనివాస్‌’ ఆమరణదీక్ష చేస్తుండడంతో అధికారపార్టీ ఈ ఉద్యమంలో తాము వెనుకకుపోతున్నట్లు భావించి..ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని రంగంలోకి దించింది. ఆయన విశాఖ స్వామి ఆశ్రమానికి వచ్చి ఉక్కు ఉద్యమ నాయకులను కలసుకుని..విశాఖస్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేట్‌ పరం కాకుండా కాపాడుతామని, దీని కోసం అసెంబ్లీల్లో తీర్మానం చేస్తామని ప్రకటించారు. దేవుని కృపతో ‘విశాఖ’ ప్రైవేట్‌ పరం కాకుండా ఉంటుందని చెప్పారు.

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ‘దేవుని’ ఆశీస్సులతో ప్రైవేట్‌పరం కాదని చెబుతుండగా ఆ పార్టీకే చెందిన రాజ్యసభ సభ్యుడు ‘విజయసాయిరెడ్డి’ ఈనెల20వ తేదీన ‘విశాఖ’లో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ‘విశాఖ’ స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకోవడానికి పాదయాత్ర చేస్తున్నానని ఆయన ప్రకటించారు. అయితే వాస్తవానికి..’విశాఖ’లో టిడిపి అధినేత ‘చంద్రబాబునాయుడు’ పర్యటన చేస్తున్నారని వార్తలు బయటకు రావడంతో తాము ఉద్యమంలో వెనుకంజలో ఉన్నామని గ్రహించి వైకాపా నేతలు పాదయాత్రతో టిడిపికి కౌంటర్‌ చేయాలని భావిస్తున్నారు. ఒక వైపు ‘పల్లా’ ఆమరణదీక్ష, మరో వైపు ‘చంద్రబాబు’ పర్యటనతో వైకాపా నేతలు ‘పాదయాత్ర’ చేస్తున్నారనే మాట సర్వత్రా వినిపిస్తోంది. కాగా..విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేట్‌ పరం కాకుండా ఉద్యమకారులు, ఇతరులు ఆందోళన చేస్తుంటే రాజకీయపార్టీలు మాత్రం మైలేజ్‌కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి.