తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాస్సేపట్లో తిరుపతి పర్యటనకు రానున్నారు. ఆర్మీ అధికారులు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. మాజీ సైనికుల సన్మాన కార్యక్రమానికి హాజరు కానున్నారు. 1971 నాటి భారత్-పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న ఆర్మీ అధికారి మేజర్ జనరల్ సీ వేణుగోపాల్‌ను ఆయన సన్మానించనున్నారు. అనంతరం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. జగన్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు.

భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం చోటు చేసుకుని 50 సంవత్సరాలు పూర్తవుతోన్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం..ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. దీనికోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. స్వర్ణిమ్ విజయ్ మషాల్ పేరుతో గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన కాగడాను వెలిగించారు. భారత్-పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులు, ఆర్మీ అధికారులు ఉన్న ప్రాంతాలకు ఈ కాగడాను తీసుకెళ్తారు. ఆ ఈ కాగడా తొలిసారిగా దక్షిణాది రాష్ట్రాల్లో అడుగు పెడుతోంది. తిరుపతితో దక్షిణాది దాని ప్రయాణం ఆరంభం కాబోతోంది