ఖమ్మం జిల్లాలో కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లిలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. ఎన్నికల్లో నోట్ల ప్రభావం తగ్గించేందుకు పనిచేయాల్సిన నేతలే ప్రత్యర్థులు ఇచ్చిన డబ్బులు తీసుకుని మరీ తమకి ఓటేయమని చెబుతుండడంతో నోటు తీసుకునేందుకు ఓటర్లు కూడా ఏమాత్రం సంకోచించడం లేదు. ఓటుకు నోటు ఇస్తే ఫర్వాలేదు కానీ ఇవ్వకపోతే మాత్రం దాడులు చేసే దారుణ పరిస్థితికి చేరుకోవడం ఆందోళన కలిగించే అంశం.

టీఆర్‌ఎస్ నేత జాల సాంబ, అదే గ్రామానికి చెందిన పచ్చిపాల వెంకట్‌ నడుమ గత రెండురోజులుగా వాట్సాప్ లో వార్ నడుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు వచ్చిన డబ్బులను పంచకుండా ఇంట్లో పెట్టుకున్నాడని సాంబని వెంకట్ ప్రశ్నిస్తుండడంతో అదే విషయం చినికిచినికి గాలివానగా మారి కత్తులతో దాడి చేసే వరకూ వెళ్లింది. సాంబపై ఆగ్రహంతో ఊగిపోయిన పచ్చిపాల వెంకట్ కత్తితో పొడిచేశాడు. గాయాలపాలైన సాంబని గ్రామస్తులు వెంటనే 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇద్దరూ అధికార టీఆర్‌ఎస్ పార్టీ నాయకులే కావడంతో తీవ్ర కలకలం రేపుతోంది.