ఐరాస నిపుణుల బృందం కొవిడ్-19 పై అధ్యయనం చేసి దాని ఆధారంగా కొవిడ్-19 సీజనల్‌ వ్యాధిగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా వ్యాప్తిపై వాతావరణ మార్పులు, గాలి నాణ్యత ప్రభావాల వల్ల శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్లు తరచూ సీజనల్‌గా మారతాయని ఈ నిపుణుల బృందం వెల్లడించింది. శీతాకాలంలో ఇన్‌ఫ్లూయెంజా విజృంభణ ఉంటుందని, సమశీతోష్ణ వాతావరణ పరిస్థితుల్లో జలుబు కలిగించే కరోనా వైరస్ వ్యాప్తి ఉంటుందని హెచ్చరించింది.

ఇదిలా ఉండగా ఇప్పటివరకు కొవిడ్-19 వ్యాప్తి వాతావరణ అంశాల కంటే ప్రభుత్వం విధించే నిబంధనల ద్వారానే ఎక్కువగా ప్రభావితమైంది. మాస్కులు, ప్రయాణ ఆంక్షలు, లాక్‌డౌన్, కర్ఫ్యూ వంటి ప్రభుత్వ చర్యలు కరోనా వ్యాప్తిని దాదాపుగా కట్టడి చేస్తున్నాయి. అందువల్ల వాతావరణ అంశాల ఆధారంగా మాత్రమే ఆంక్షల సడలింపు దిశగా ప్రభుత్వాలు దృష్టి సారించలేవని నిపుణుల బృందం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో వేడి వాతావరణంలో కూడా ఈ మహమ్మారి విజృంభించింది కావున రాబోయే సంవత్సరంలో ఇలా జరగదు అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. చల్లని, పొడి వాతావరణంలో, తక్కువ స్థాయిలో అతినీలలోహిత కిరణాల ప్రసారం ఉన్నప్పుడు వైరస్ ఎక్కువ కాలం మనుగడ సాగించినట్లు గుర్తించాము అంది. వైరస్ ప్రసారంపై వాతావరణ మార్పులు, గాలి నాణ్యత ఏ మేరకు ప్రభావం చూపుతాయన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని పేర్కొంది. మరోవైపు వాయు కాలుష్యం కూడా మరణాల రేటు పెంపునకు దోహదం చేస్తుందని, వైరస్ ప్రసారంపై మాత్రం నేరుగా ప్రభావం చూపదని కొన్ని అధ్యయనాలు ప్రాథమికంగా వెల్లడి చేస్తున్నాయి. ఇంకా దీనిపై అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.