వినియోగదారులను ఏదోవిధంగా తమ ప్రకటనలతో ఆకర్షించి తమ అమ్మకాలు పెంచుకునే పనిలో కొన్ని కంపెనీలు ఉన్నాయి. అదే బాటలో దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటామోటార్స్‌ వినియోగదారులను ఆకర్షించేందుకు వివిధ మోడల్‌ కార్లపై భారీగా డిస్కౌంట్లు ప్రకటించింది.
రూ. 65వేల వరకు అత్యధికంగా ఉన్న ఈ డిస్కౌంట్లు మార్చి 31 వరకు అందుబాటులో ఉంటాయి. టియాగో, టిగోర్‌, నెక్సాన్‌, హ్యారియర్‌(5సీట్ల మోడల్‌)లకు ఈ ఆఫర్లు ప్రకటించి, ఆల్టురజ్‌, సఫారీ ఎస్‌యూవీపై మాత్రం ఎటువంటి ఆఫర్లు ప్రకటించలేదు. కన్జ్యూమర్‌ స్కీమ్‌, ఎక్స్‌ఛేంజి ఆఫర్‌, కార్పొరేట్‌ స్కీమ్‌ల రూపంలో వీటిని అందచేస్తుంది.

టాటా టియాగో మోడల్‌పై రూ.25వేలను తగ్గించగా వీటిల్లో కన్జ్యూమర్‌ స్కీమ్‌ రూ.15వేలు, ఎక్స్‌ఛేంజి ఆఫర్‌ రూ.10 వేలు ఉన్నాయి. ఇక టిగోర్‌ సెడాన్‌పై కన్జ్యూమర్‌ స్కీమ్‌లో రూ. 15వేలు, ఎక్స్‌ఛేంజి ఆఫర్‌లో రూ.15 వేలు డిస్కౌంట్‌ రూపంలో ఇస్తున్నారు. నెక్సాన్‌ సబ్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీపై రూ.15వేలు డిస్కౌంట్‌గా లభిస్తోంది. ఇదే కారు డీజిల్‌ వెర్షన్‌పై ఎక్స్‌ఛేంజి ఆఫర్‌ మాత్రమే లభిస్తోంది. హారియర్‌ 5సీట్ల మోడల్‌ క్యామో వేరియంట్‌పై మాత్రం రూ.40వేలు లభిస్తోంది. సాధారణ హారియర్‌పై రూ.65 వేల వరకు తగ్గింపు ఉంది. కాకపోతే హారియర్‌లో పరిమిత వేరియంట్లకే ఆఫర్లు వర్తిస్తాయి. మిగిలిన వాటికి వర్తించవు.