వార్తలు (News)

పెరిగిన కొవిడ్‌ ఉద్ధృతి – మరిన్ని మరణాలు

ఒక కార్పొరేట్‌ ఆసుపత్రిలో గత నెలలో 30 పడకల్లో కొవిడ్‌ బాధితులు చికిత్స పొందారు కానీ ఈ నెలలో ఇప్పటికే రోగుల సంఖ్య 80 దాటడం పరిస్థితి తీవ్రత అర్ధమవుతుంది. ఇలాంటి ఉదాహరణను పరిశీలిస్తే రాష్ట్రంలో రెండో దశ ఉద్ధృతి (సెకండ్‌ వేవ్‌) ముప్పు పొంచి ఉంది అనే సందేహాలు క్రమేణా బలపడుతున్నాయి. అన్ని ఆసుపత్రిల్లో చేరుతున్నవారి సంఖ్య కూడా దాదాపు రెండింతలు పెరిగినట్లుగా వైద్యవర్గాలు తెలిపాయి. గత నెల వరకూ కేవలం కేరళ, మహారాష్ట్రలకే పరిమితమైన కొవిడ్‌ ఉద్ధృతి ఇప్పుడు నెమ్మదిగా కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లకూ విస్తరించడంతో ఆ ప్రభావం తెలంగాణపైనా పడే అవకాశాలున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది సెప్టెంబరు నుంచి క్రమేణా తగ్గిన కేసుల సంఖ్య ఈ నెలలో నెమ్మదిగా పెరుగుతుండడం.. అందులోనూ కేవలం 16 రోజుల వ్యవధిలోనే దాదాపు 60 శాతానికి పైగా కొత్త కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తుంది.

ఈనెల 16న 247 కొత్త పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి. ఈ ఏడాదిలో ఒక్కరోజులో నమోదైన కొత్త కేసుల్లో ఇదే అత్యధికం. గత రెణ్నెళ్లుగా రోజుకు సగటున ఒకట్రెండు మరణాలు నమోదవుతుంటే ఈనెలలో రెండోసారి (10న, 16న) ఒక్కరోజులో 3 మరణాలు నమోదయ్యాయి. వైరస్‌ పూర్తిగా ఆక్రమించక ముందే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

సరిహద్దు జిల్లాల్లో ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతున్నట్లుగా ఆరోగ్యశాఖ గుర్తించింది. వైరస్‌ తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, కేరళ తదితర రాష్ట్రాల నుంచి రాకపోకలపై నిఘా లేకపోవడమూ కేసుల పెరుగుదలకు కారణమని వైద్య ఆరోగ్యశాఖ విశ్లేషిస్తోంది. మొదటి నుంచి ఎక్కువ కేసులు నమోదవుతున్న జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో అలాగే సాగుతుండగా ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, మెదక్‌, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్‌ నగర.. తదితర 15 జిల్లాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 247 కొవిడ్‌ కేసులు నమోదు కాగా, మొత్తం బాధితుల సంఖ్య 3,01,769కి పెరిగింది. మరో ముగ్గురు చెందడంతో ఇప్పటి వరకూ 1,659 మంది కన్నుమూశారు. 158 మంది కరోనాకు చికిత్స పొంది ఆరోగ్యవంతులు కాగా, మొత్తంగా 2,98,009 మంది కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం 60,527 నమూనాలను పరీక్షించారు..

ఏపీలో గడిచిన 24 గంటల్లో 253 మంది కొవిడ్‌-19 బారిన పడ్డారు. గుంటూరులో ఒకరు మృతి చెందారు. అత్యధికంగా గుంటూరులో 69, చిత్తూరు 39 కేసులు నమోదయ్యాయి.

కరీంనగర్‌ జిల్లా వీణవంక ఏఎస్సై గాజర్ల యాదగిరి(56) కరోనాతో బుధవారం మృతి చెందినట్లు ఎస్సై కిరణ్‌రెడ్డి తెలిపారు. యాదగిరి ఫిబ్రవరిలో మొదటి డోసు, ఈ నెల 6న రెండో డోసు టీకా తీసుకున్నట్లు చెప్పారు. ఈ నెల 12న సొంత గ్రామం పెద్దపల్లికి వెళ్లిన ఆయన జ్వరం, జలుబుతో అస్వస్థతకు గురి కాగా కరీంనగర్‌ ఆసుపత్రిలో చేరినట్లు వెల్లడించారు. ఈ నెల 15న కొవిడ్‌ నిర్ధారణ కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. యాదగిరికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.