మనుషులలో పశు ప్రవృత్తి ఉంటుందనడానికి అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు సాక్ష్యంగా నిలుస్తూ ఉంటాయి. అలాంటి ఘటనే బాలాపూర్‌ డీఆర్‌డీఎల్‌ శివాజీ చౌక్‌ వద్ద జరిగింది. బాలాపూర్ ఎప్పుడూ జనసమ్మర్ధంతో నిండి ఉంటుంది. అలాంటి ప్రదేశంలో ఎవరో అప్పుడే పుట్టిన పసికందు మృతదేహాన్ని అట్టపెట్టెలో పెట్టి రోడ్డుపై వదిలేసి వెళ్లారు. ఆ అట్టపెట్టె చుట్టూ కుక్కలు మూగి ఉండడంతో అనుమానం వచ్చిన స్థానికులు పెట్టె దగ్గరకు వెళ్లి చూడగా ఒక శిశువు మృతదేహం వస్త్రంలో చుట్టి కనిపించింది. దాంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. శిశువు ఇక్కడ వేసిన తర్వాత మృతి చెందాడా, మృతిచెందిన తర్వాత పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలు ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీలో భద్రపరిచారు.