కనీసం ఒక రాజధాని కూడా కట్టలేని దద్దమ్మ అయిన సీఎం జగన్.. మూడు రాజధానులు ఎలా పూర్తి చేస్తారని మాజీమంత్రి పరిటాల సునీత ఘాటుగా విమర్శలు చేసారు. అమరావతి రైతుల మహాపాదయాత్రకు సంఘీబావంగా మండలంలోని వెంకటాపురంలోని పరిటాల ఘాట్‌ నుంచి తిరుమల దేవర దేవస్థానం వరకు పాదయాత్రను గురువారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజధానికి భూములిచ్చిన రైతుల రుణం ఊపిరి ఉన్నంతవరకు తీర్చుకోలేమని అన్నారు.

మూడు రాజధానులను ప్రకటించినది విశాఖను దోచుకునేందుకేనని, త్రిమూర్తులు కలిసి దందాలు చేసి, విశాఖలోని భూములను విజయసాయిరెడ్డితో కలిసి దోచుకునేందుకేనని, ఇప్పటికే అమరావతిలో 70 శాతం భవనాలు పూర్తయిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడుపై ఎంతో నమ్మకంతో రైతులు భూములిచ్చారని అన్నారు.

ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అప్పట్లో రాజధానికి పూర్తి మద్దతు తెలిపి, అధికారం చేపట్టాక మాట మార్చేశారని విమర్శించారు. అమరావతి ప్రాంత రైతులు ఒకే రాజధాని కోసం మహాపాదయాత్ర చేస్తే వారికి అడుగడుగునా పోలీసులతో ఆంక్షలు విధించడంతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించడం దుర్మార్గం అన్నారు.

రైతులపై పెట్టిన కేసులన్నీ తాము అధికారంలోకి వచ్చాక ఎత్తివేస్తామని.. రాయలసీమ, కోస్తాలోని ఎమ్మెల్మేలు, మంత్రులు మహిళలను ఇబ్బందులకు గురిచేస్తుంటే వారు ఏం చేస్తున్నారనీ, వారికి అమరావతి రాజధాని అవసరం లేదా అని ప్రశ్నించారు.

అమరావతి రైతులు దైవదర్శనానికి వెళ్తుంటే ఆంక్షలు విధిస్తారా అని, వెంకటేశ్వరస్వామి సాక్షిగా చెబుతున్నాననీ, సీఎం జగన్ కు రైతుల ఉసురు తగలక తప్పదని అన్నారు. సభ నిర్వహించేందుకు కూడా అనుమతులు ఇవ్వలేదనీ, కోర్టు ద్వారా తెచ్చుకోవాల్సి వచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును సీఎం చేయడానికి సమష్టిగా పనిచేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.

చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాజధానితోపాటు రైతుల సమస్యలు కూడా తొలగిపోతాయని, పాదయాత్ర ప్రారంభం నుంచి మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నసనకోట, గంగంపల్లిలో పాదయాత్రకు ఘనస్వాగతం పలికారు. పాదయాత్రలో రాప్తాడు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు కూడా కలిశారు.