లెక్కలంటేనే వాటిలో అంతుచిక్కని ప్రశ్నలు లెక్కలేనన్ని ఉంటాయి. అలాంటి ప్రశ్నకు ప్రొఫెసర్ నీనా గుప్తా సమాధానం కనిపెట్టింది. డెబ్బయ్యేండ్లుగా ఎవరి వల్ల సాధ్యంకాని చిక్కుముడి విప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకుగాను ఆమెకు ఈ ఏడాది మ్యాథమెటిక్స్​లో అత్యున్నతమైన ‘రామానుజన్​ అవార్డు’ వచ్చింది. ఈ అవార్డు అందుకున్న మూడో మహిళ నీనా.

కోల్​కతాలోని ఇండియన్​ స్టాటిస్టికల్​ ఇనిస్టిట్యూట్​లో ప్రొఫెసర్​గా పనిచేస్తున్న నీనాగుప్తా ఇదే కాలేజీలో మ్యాథ్స్​లో పీజీ చేసింది. ఆ తర్వాత ఆల్​జిబ్రాయిక్​ జియోమెట్రీలో పీహెచ్​డీ చేసి, ప్రొఫెసర్​గా పనిచేస్తూనే అంతుచిక్కని ప్రశ్నలకి సమాధాలు వెతకడాన్ని ఛాలెంజ్​గా తీసుకునేది.

2014లో ఆల్​జిబ్రాయిక్​ జియోమెట్రీలో ‘జరస్కీ క్యాన్సిలేషన్ కంజెక్చర్’ అనే చిక్కుప్రశ్నకి సమాధానం కనుగొన్నది. దాంతో ఆ ఏడాది తనకు ఇండియన్​ నేషనల్​ సైన్స్​ అకాడమీ యంగ్​ సైంటిస్ట్ విభాగంలో మెడల్​ ఇచ్చారు. మ్యాథ్స్​లోని మొండి ప్రశ్నకి సొల్యూషన్​ చెప్పినందుకు ఇప్పుడు నీనాకు ప్రెస్టీజియస్​ రామానుజన్​ అవార్డు వచ్చింది. ఈ అవార్డు సాధించిన నాలుగో ఇండియన్ తనే​. అంత పెద్ద అవార్డు వచ్చింనందుకు ఆనంద పడుతూనే, కమ్యుటేటివ్​ ఆల్​జీబ్రా విభాగంలోని ప్రశ్నలకి సమాధానాలు వెతికే పనిలో ఉంది ఈ మ్యాథమెటీషియన్​.

”చిన్నప్పటి నుంచి మ్యాథమెటిక్స్​ నా ఫేవరెట్​ సబ్జెక్ట్​. అయితే, డిగ్రీ చదివిన తర్వాత మావాళ్లు నాకు పెళ్లి చేయాలి అనుకున్నా కానీ లెక్కల మీద నాకున్న ఇంట్రెస్ట్​ చూసి పెళ్లి ఊసెత్తలేదు. జరస్కీ క్యాన్సిలేషన్​ కంజెక్చర్​ ప్రాబ్లమ్​ నాకు పీహెచ్​డీ రోజుల నుంచే తెలుసు. కానీ ఎప్పుడూ నేనే ఈ చిక్కుప్రశ్నకి సమాధానం కనుక్కుంటానని అనుకోలేదు. రామానుజన్​ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. అయితే, మ్యాథమెటిక్స్​లో సొల్యూషన్​ చూపించాల్సిన ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి’ అని నీనా గుప్త చెప్పారు.