ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పాలన అంటేనే నియంతృత్వానికి పరాకాష్టగా చెప్పవచ్చు. ఆయన చెప్పింది చెప్పినట్టు ప్రజలు అమలు చేసేలాగా చర్యలు తీసుకుంటూ ప్రజలను తన చెప్పుచేతల్లో పెట్టుకుంటూ ఉంటారు. కరోనా కారణంగా ఎదురైన సంక్షోభం వల్ల దేశంలో ఆహార ఉత్పత్తి తగ్గి ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే ప్రజలను ఆదుకోవాల్సిన అధ్యక్షుడు ప్రజలు అతి తక్కువ ఆహారం తినాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసి చేతులు దులుపుకున్న సంఘటన అందరికి తెలిసిందే.

ఇప్పుడు తాజాగా తీసుకున్న మరో నిర్ణయం గురించి తెలుసుకుంటే ముక్కున వేలు వేసుకోకుండా ఉండలేము. ఇదేంటంటే.. కిమ్ తండ్రి, ఉత్తర కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఇల్ మరణించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా 11 రోజుల పాటు ప్రజలంతా సంతాప దినాలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడితో ఆగకుండా ఈ 11 రోజుల్లో ఎవరూ సంతోషంగా గడపడం కాని, నవ్వడం కాని, పార్టీలు చేసుకోవడం కాని, మద్యం సేవించడం కాని చేయకూడదని నిషేధం విధించారు.

ఇప్పుడు ఇంకా ఒక అడుగు ముందుకు వేసి డిసెంబర్ 17 న ప్రజలు నిత్యావసర వస్తువులు కూడా కొనకూడదని ఉత్తర్వులు జారీ అవ్వడమే కాకుండా ఈ 11 రోజుల్లో ఎవరైనా చనిపోతే.. కుటుంబ సభ్యులు గట్టిగా ఏడవకూడదని నిబంధనలు విధిస్తూ ఎలాంటి హడావుడి లేకుండా అంత్యక్రియలు పూర్తిచేయాలని స్పష్టం చేశారు. పుట్టిన రోజులు జరుపుకోవడాన్ని ఈ 11 రోజులు పూర్తిగా నిషేధించారు. ప్రభుత్వ ఆదేశాలు ఎవ్వరైనా అతిక్రమిస్తే.. వారికి కఠిన చర్యలు తప్పవని తేల్చేశారు. గతంలో ఇలాంటి వారిని అరెస్టులు చేసి.. దారుణమైన శిక్షలు వేశారు. ఇలా నిబంధనలు పాటించని కొందరు కనిపించకుండా పోయారు. వారు ఏమైయ్యారో ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.

కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ కూడా 1994 నుంచి 2011 వరకు 17 ఏళ్ల పాటు ఉత్తర కొరియా అధ్యక్షుడుగా ఉన్నారు. ఇల్ పాలన కూడా ఇదే తరహాలో ఉంటూ కఠినాత్ముడుగా పేరు తెచ్చుకున్నాడు. 2011 డిసెంబర్ 17న 69 ఏళ్ల వయస్సులో గుండెపోటుతో మరణించాడు. తండ్రి మరణం తర్వాత కిమ్ జోంగ్ ఉన్ అధికార పీఠాన్ని ఎక్కాడు.