ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ భారత దేశంలోనూ విస్తరిస్తుంది. తాజాగా దిల్లీలో మరో 10 మందికి ఒమిక్రాన్‌ సోకడంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 97కు చేరింది.

ఈ కొత్త వేరియంట్‌ కేసుల్లో సగానికి పైగా కేసులు కేవలం మహారాష్ట్ర, దిల్లీల్లోనే నమోదవుతున్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 32 ఒమిక్రాన్‌ కేసులు బయటపడగా.. దిల్లీలో ఈ సంఖ్య 20కి చేరింది. ఆ తర్వాత రాజస్థాన్‌లో 17, కర్ణాటకలో 8, తెలంగాణలో 8 కేసులు నమోదయ్యాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, గుజరాత్‌, కేరళలలోనూ ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూశాయి. దిల్లీలో నమోదైన మొత్తం కేసుల్లో.. ఇప్పటికే 10 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయినట్లు అక్కడి ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్‌ వెల్లడించారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు తెలిపారు.