దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఒమిక్రాన్‌ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా నాలుగు ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసులను గుర్తించారు. వీటితో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 77కు పెరిగింది. మహారాష్ట్రలో అత్యధికంగా 32 కేసులు బయటపడగా ఆ తర్వాత రాజస్థాన్‌లో 17 కేసులు, ఢిల్లీలో 10, కేరళలో ఐదు, గుజరాత్‌లో నాలుగు, కర్ణాటకలో మూడు, తెలంగాణలో రెండు, బెంగాల్, ఏపీ, చండీఘర్‌, తమిళనాడులో ఒక కేసు చొప్పున వెలుగుచూశాయి.

మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శర వేగంగా వ్యాపిస్తుండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర రాజధాని ముంబైలో హై అలర్ట్ ప్రకటించారు. డిసెంబర్ 16 నుంచి 31 వరకు అక్కడ 144 సెక్షన్‌ను విధించారు. ఇక క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు. జనాలు ఎవరూ గుమిగూడొద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసులు విజ్ఞఫ్తి చేశారు.