ఉత్తర భారతదేశం సందర్శించుకోవాలనుకునే రైల్వే ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. విజయవాడ నుంచి పర్యాటకుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు IRCTC డిప్యూటీ జనరల్ మేనేజర్ కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వీటికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. కొత్త ఏడాదిలో మూడు నెలల పాటు 3 ప్రత్యేక టూరిస్ట్ ట్రైన్లు ప్రారంభిస్తున్నామన్నారు.

తీర్థయాత్ర ప్రత్యేక పర్యాటక రైలు ద్వారా గుజరాత్ యాత్ర ప్రారంభం కానుందని, మొదటి టూర్‌ జనవరి 21 నుంచి ప్రారంభమై 31తో ముగుస్తుందన్నారు. టూర్‌లో సోమనాథ్‌, ద్వారక, నాగేశ్వర్, బెట్ ద్వారక, అహ్మదాబాద్, స్టాట్యూ ఆఫ్ యూనీటి సందర్శించే అవకాశం ఉందని, టిక్కెట్‌ ధరలు కూడా అందుబాటు ధరల్లోనే ఉంటాయని తెలిపారు. .

ఒక వ్యక్తికి స్లీపర్ క్లాస్ కి 10400, కంఫర్ట్ కి 17,330 రూపాయల కాస్ట్ అవుతుందన్నారు. దీంతో పాటు ఆగ్రా, అమృత్‌సర్‌, హరిద్వార్‌, వాఘా బార్డర్‌, గోవా, హంపి ఇలా అనేక టూరిస్ట్‌ ప్రదేశాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు వెల్లడించారు. స్టే నుండి ఫుడ్ వరకు అన్ని రైల్వేశాఖ అందజేస్తుందన్నారు. ఒక్కో రైళ్లలో 500 నుండి 600 వరకు ప్రయాణించే అవకాశం ఉందన్నారు. ఇక ఇప్పటికే దక్షిణ భారత యాత్ర సక్సెస్‌పుల్‌గా కొనసాగిందని పేర్కొన్నారు.

కరోనా నిబంధనల పాటిస్తూనే ఐఆర్‌టీసీ యాత్ర సదుపాయాలను కల్పిస్తుందని.. రెండు, మూడు రోజుల టూర్‌ ప్యాకెజీలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. రూ. 3000 ధరతో టూర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. తిరుపతి దర్శనం కూడా ట్రైన్ టూర్ ప్యాకేజ్ ద్వారా సులువుగా పూర్తి అవ్వడమే గాక త్వరగా దర్శన సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు చెప్పారు. 3,220 రూపాయలకు విజయవాడ నుండి తిరుపతి దర్శనం వరకు ఇబ్బంది లేకుండా చేయించనున్నట్టు వెల్లడించారు. గ్రూప్ టూర్స్ కూడా అందుబాటులోకి తీసుకు వచ్చామని.. IRCTC వెబ్ సైట్ లో ప్యాకేజ్ డీటెయిల్స్ చూసుకుని బుక్ చేసుకోవచ్చని కిషోర్‌ తెలిపారు.