ఫిలిప్పీన్స్ దేశానికి మధ్య, దక్షిణ భాగాల వైపు సూపర్ టైఫూన్ వేగంగా కదులుతున్న నేపథ్యంలో ఈదురు గాలుల్తోపాటు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు, ఇది ఈ ఏడాది దేశాన్ని తాకిన 50వ తుఫాను మాత్రమేకాకుండా అత్యంత శక్తివంతమైన తుఫానుగా మారనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తుఫాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా కాపాడేందుకు వేలాది మంది ప్రజలను ఆ దేశ ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. చాలామంది ప్రజలు తమంతట తామే ఇల్లు వదిలి వెళ్లిపోయారు.

ఈ నేపథ్యంలో ఫిలిప్పీన్స్ వైపు దూసుకుపోతున్న రాయ్ టైఫూన్‌ను అమెరికా నేవీ జాయింట్ టైఫూన్ వార్నింగ్ సెంటర్ ‘సూపర్ టైఫూన్’గా అభివర్ణించింది. దేశంలో ఈ యేడాది సంభవించిన తుఫానుల్లో ఇది అత్యంత శక్తివంతమైన తుఫానుగా మారబోతోందని వెల్లడించింది. ఫిలిప్పీన్స్‌లో రాయ్ హరికేన్ 185 కి.మీ వేగంతో కదులుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. విపత్తు నిర్వహణ బృందం అన్ని నౌకలను ఓడరేవులో ఉంచాలని కోరింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రం వైపు వెళ్లవద్దని హెచ్చరించింది.

ఫిలిప్పీన్స్‌లోని 8 ప్రాంతాల్లో అత్యవసర సన్నాహాలు పూర్తవ్వడంతో అన్ని ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. టైఫూన్ కారణంగా పసిఫిక్ మహాసముద్రం సమీప ప్రాంతాల్లోని సుమారు 98,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఐతే 8 ప్రభావిత ప్రాంతాల్లో 30 మిలియన్ల మంది నివసిస్తున్నారు. ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాలు విసాయా – మిండనావో ఐలాండ్ల మధ్య ఉన్నాయి. తుఫాను సమయంలో, ఆ తర్వాత కూడా దేశవ్యాప్తంగా భారీ వర్షం, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్లు సమాచారం అందడంతో విమానాలు, ఓడరేవులు పూర్తిగా మూసివేయబడ్డాయి.