తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, వసతుల కల్పనకు 7,289 కోట్లతో మన ఊరు మన బడి ప్రణాళికకు ..కేబినెట్‌ ఆమోదం తెలుపుతూ వచ్చే ఏడాది నుంచి నూతన విద్యా చట్టం తెచ్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంలో విద్యా బోధన జరపాలని నిర్ణయించింది. ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు అధ్యయనం చేయాలని మంత్రివర్గం నిర్ణయించుకుంది.

ఈ రెండు అంశాలపై విధివిధానాల రూపకల్పనకు కేబినెట్‌ సబ్‌ కమిటి ఏర్పాటు చేసింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌ కమిటి ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ కమిటీలో సభ్యులుగా కేటీఆర్‌, హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, తలసాని శ్రీనివాస యాదవ్‌, పువ్వాడ అజయ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, జగదీశ్‌ రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి ఉన్నారు.