వార్తలు (News)

హ్యాపీ బర్త్ డే టు కాశీనాథుని విశ్వనాథ్‌ గారు

ఆ దర్శకుని సినిమాలంటే ప్రేక్షకలోకం పలవరిస్తుంది..వెండితెర పరవశిస్తుంది.ఆయన తీసిన ప్రతీ చిత్రం ఒక స్వాతిముత్యం,ఒక ఆణిముత్యం.సినిమాను తన కెమెరా కనుసన్నల్లో సిరివెన్నెల్లా పండించిన ప్రతిభామూర్తి,తన హృదయాంతరాల్లోనుండి స్వాతిముత్యాలను వెలికితీసిన వెండితెర స్ఫూర్తి.నిరంతర తపన, నిత్యాన్వేషణ, నిలువెల్లా క్రమశిక్షణ ఆయనకే స్వంతం..

తెలుగు సినిమాతో ఆయన సంబంధం ఒక సాప్తపదీయం.తెలుగు సినిమాకు ప్రబంధ గౌరవాన్ని కల్పించిన మహనీయుడు.తెలుగు సినిమా స్థాయిని పెంచి ప్రేక్షకులకు హాయిని పంచిన మాన్యుడు.తెలుగు సినిమా స్ధితిని, గతిని ఆకాశానికెత్తిన అసామాన్యుడు..
తెలుగు సినిమా దిశను, దశను మార్చిన అనన్య సామాన్యుడు ఆయనే కళాతపస్వి విశ్వనాథ్‌.

జననం : కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్‌ 1930 ఫిబ్రవరి 19వ తేదీన గుంటూరు జిల్లా పెదపులివఱ్ఱు గ్రామంలో జన్మించారు. తల్లి సరస్వతమ్మ, తండ్రి సుబ్రహ్మణ్యం. తండ్రి సినిమా పంపిణీ సంస్ధలో పనిచేసినందువలన విశ్వనాథ్‌కు సినీరంగంతో బంధం సులభంగా ఏర్పడింది. ఆయన విద్యాభ్యాసం విజయవాడ, గుంటూరులలో జరిగింది.
వివాహం – కుటుంబం : విశ్వనాథ్‌ భార్యపేరు జయలక్ష్మి. ఆ దంపతులకు పద్మావతి అనే కుమార్తె నాగేంద్రనాథ్‌, రవీంద్రనాథ్‌ అనే కుమారులు గలరు. మొత్తంగా విశ్వనాథ్‌కు ఆరుగురు మనుమలు ఉన్నారు. వారెవరూ సినిమా రంగంలోకి అడుగుపెట్టలేదు. వేర్వేరు రంగాల్లో స్ధిరపడ్డారు.

జీవనయానం: విశ్వనాథ్‌ గారు బి.ఎస్సీ పాసయిన కొత్తలో బి.ఎన్‌.రెడ్డిగారు వాహినీ స్టూడియోను ప్రారంభించడం జరిగింది. బి ఎన్‌ రెడ్డిగారికి విశ్వనాథ్‌గారి తండ్రిగారికి గల అవినాభావసంబంధం వలన స్టూడియోలకి టెక్నీషియన్‌గా ఆహ్వానించగా వాహినీ స్టూడియోలో సౌండ్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరారు. 1949-50లో మద్రాసు చేరుకున్నారు. సౌండ్‌ రికార్డిస్ట్‌గా పనిచేస్తూనే కెమెరా డిపార్ట్‌మెంట్‌, లేబొరేటరీలలో కూడా ప్రధాన అంశాలను మెళకువలను నేర్చుకున్నారు. తోడికోడళ్లు, మాంగల్యబలం వంటి చిత్రాలను సౌండ్‌ రికార్డిస్ట్‌గా పనిచేసారు. ఆ సమయంలోనే అక్కినేని నాగేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావులతో పరిచయం ఏర్పడింది. విశ్వనాథ్‌లోని ఎబిలిటీ, క్రియేటివిటీలను గుర్తించిన వారిరువురూ దర్శకత్వ శాఖలోకి వస్తే బాగుంటుందని సూచించారు. ప్రోత్సహించారు. అప్పుడే అన్నపూర్ణ సంస్థలో ఆదుర్తి సుబ్బారావు గారితో కలిసి దర్శకత్వ శాఖలో పనిచేసారు. రెండు సినిమాలు అసోసియేట్‌ డైరక్టర్‌గా పనిచేసిన తరువాత మూగమనసులు, తేనెమనసులు చిత్రాలకు సెకండ్‌ యూనిట్‌ డైరక్టర్‌గా వ్యవహరించారు. ఆ తరువాత అన్నపూర్ణ బ్యానర్‌లో ఆత్మగౌరవం సినిమాకు దర్శకత్వం వహించారు.


అక్కినేనితో పరిచయం ఆయన ఒక ఆర్టిస్ట్ గాను, విశ్వనాథ్‌ ఒక డైరక్టర్‌గాను కాకుండా అంతకు ముందే మూగమనసులు చిత్రంలో కలసి పనిచేయడం వలన బెరుకు, భయం లేకుండా ఒక టాప్‌ స్టార్‌తో పనిచేస్తున్నాననే ఫీలింగ్‌ లేకుండా ఎంతో ఫ్రీగా పనిచేయగలిగారు. తొలిరోజుల్లో దర్శకత్వం చేపట్టే సమయంలో దానిని ఫిలసాఫికల్‌గా తీసుకున్నారే తప్ప అదే తన కెరీర్‌ అవుతుందని, ఒక వేళ సినిమాలు ఫెయిల్‌ అయితే ఏమవుతామనే టెన్షన్‌ ఆయనకు లేదు. తొలి సారిగా దర్శకత్వం వహించిన ఆత్మగౌరవం చిత్రానికి నంది అవార్డు రావడం పేరు ప్రతిష్టలతో పాటు అవకాశాలు కూడా వచ్చాయి.
తొలి రోజుల్లో : సినీరంగంలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో అంటే 18 ఏళ్ల వయస్సులో విశ్వనాథ్‌ గారు మద్రాసులోని వాహినీ స్టూడియోలో (టెక్నీషియన్‌గా) సౌండ్‌ రికార్డిస్ట్‌గా తన ప్రస్ధానాన్ని ప్రారంభించారు. తరువాత కొంతకాలానికి ఆదుర్తి సుబ్బారావు వద్ద అసిస్టెంట్‌ డైరక్టర్‌గా చేరారు. ఆ తరువాత రామ్‌నాథ్‌, బాలచందర్‌, బాపుల వద్ద అసిస్టెంట్‌ డైరక్టర్‌గా పనిచేసారు.సమాజంలో మార్పుకోసం తపించిన విశ్వనాథ్‌ : ఈ సమాజాన్ని కలుషితం చేస్తున్న సాంఘిక దురాచాలపై తన సినిమాల ద్వారా విశ్వనాథ్‌ పోరాడారని చెప్పవచ్చు. తద్వారా ప్రజల్లో మార్పులు తేవడంలో సఫలీకృతమయ్యారు. అంటరాని తనం, కుల వివక్ష అనే అంశాలను సప్తపది చిత్రంలో ప్రస్ఫుటంగా చూపారు.శుభోదయం, స్వయం కృషి చిత్రాల ద్వారా మనిషి తన వృత్తిద్వారా కష్టపడి పనిచేయడంలో గల ఆనందాన్ని, ఆత్మగౌరవాన్ని చూపారు. వరకట్నం అనే దురాచారంపై శుభలేఖ చిత్రం ద్వారా హాస్యాన్ని జోడించి సందేశాన్ని అందించారు. హింసామార్గాలను విడనాడి శాంతియుతంగా జీవించాలని సందేశంతో సూత్రధారులు చిత్రానికి దర్శకత్వం వహించారు. తన కోపమే తన శత్రువు అని గురువు, శిష్యుల మధ్య సంబంధం ఎలా ఉంటే బాగుంటుందో, ఎలా ఉండకూడదో అనే సందేశాన్ని స్వాతి కిరణం చిత్రం ద్వారా కళ్లకు కట్టినట్లుగా, మనసుకు హత్తుకు పోయేలా చూపారు.

పూర్ణోదయా క్రియేషన్స్‌తో అనుబంధం : ఏడిద నాగేశ్వరరావు స్ధాపించిన పూర్ణోదయా క్రియేషన్స్‌ ద్వారా శంకరాభరణం చిత్రం ద్వారా అనుబంధాన్ని ప్రారంభించిన విశ్వనాథ్‌ దర్శకత్వంలో స్వాతి ముత్యం, సాగర సంగమం, సూత్రధారులు, ఆపద్బాంధవుడు చిత్రాలను అందించారు.

నటుడిగా విశ్వనాథుడు : తొలిసారిగి 1995లో విశ్వనాథ్‌ గారు శుభసంకల్పం చిత్రంద్వారా నటుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. కమలహాసన్‌, ఎస్‌ పి బాలసుబ్రహ్మణ్యంలు బలవంతపెట్టినందువలన వెండితెరపై నటించారు. అందువల్లనే శుభసంకల్పం నుండి నటునిగా సరికొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. కమలహాసన్‌తో శుభసంకల్పం, ద్రోహి చిత్రాలలోను, వెంకటేష్‌తో ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే, నాగార్జునతో వజ్రం, సంతోషం, గ్రీకువీరుడు, బాలకృష్ణతో లక్ష్మీనరసింహ, నరసింహనాయుడు వంటి చిత్రాల్లో నటించారు. తెలుగు సినిమాల్లో పెద్దరికం ఆపాదించే పాత్రలను పోషించాలంటే కైకాల సత్యనారాయణ తరువాత కాశీనాథుని విశ్వనాథ్‌కే సాధ్యమని అన్నంతగా ప్రాచుర్యం పొందారు.

కళాతస్విగా విశ్వనాథ్‌ : కళాతపస్వి బిరుదును తొలుత విశ్వనాథ్‌ సున్నితంగా తిరస్కరించారు.నాలోను కొన్ని అవలక్షణాలు ఉన్నాయి. నేను జర్దా వేస్తాను. ఎవరైనా అందంగా కనిపిస్తే మరోసారి చూడాలని నేనూ అనుకుంటాను. నేనేం అంత సన్మార్గుణ్ణి, చాలా గొప్పవాణ్ణి అని నేను అనుకోవడం లేదు. కాబట్టి కళాతపస్వి బిరుదుకు నేను తగను అన్నారు. ఆ సభలో ఉన్న పుట్టపర్తి నారాయణాచార్యులు మాట్లాడుతూ తపస్వి అంటే పుట్టలు పెంచుకుని గెడ్డాలు పెంచుకోవడం కాదు. అస్తమాను రామనామం జపించేవాడు కాదు తపస్వి అంటే. ఎవరైతే వారు చేసే పనిపట్ల తపన పడతారో వారే తపస్వి అని చెప్పారు. అప్పుడు కళాతపస్వి బిరుదును అందుకున్నారు.

ఆయన జీవితమంతా పోరాటమే. ప్రతీదీ సాహసమే..నమ్మిన విలువల దిశగా రాజీలేని పోరాటం సాగించిన అవిశ్రాంత యోధుడు. 50 ఏళ్లు దాటిన జె వి సోమయాజులును హీరోగా ప్రధాన పాత్రలో శంకరాభరణం వంటి సినిమా తీయడం అంటే సాహసం గాక మరేమవుతుంది. శంకరాభరణం చిత్రంలో పాటలను శాస్త్రీయ సంగీతంలో దిగ్గజాలైన బాలమురళితోనో, కె జె ఏసుదాస్‌తోనో పాడించుకోక బాలుతో పాడించుకున్నారు. పుహళేంది ఇచ్చిన అభయం కారణంగానే శంకరాభరణంలో పాటలను పాడగలిగానని సాక్షాత్తూ బాలు గారు ప్రస్తావించినట్లు కొంతమంది చెబుతారు. కానీ అసలు కారణం అది కాదని శంకరాభరణం సినిమా గురించి అనుకున్న వెంటనే ఆ సినిమాలో పాటలు బాలుతోనే పాడించాలని నిర్ణయించుకున్నామని, ఎవరినైనా తన మిమిక్రీతో అనుకరించగలిగే అద్భుతమైన శక్తి కలిగిన బాలు ఎటువంటి పాటలనైనా పాడగలరని భావించారు. అందుకే శంకరాభరణం చిత్రంలో టైటిల్స్‌లో ”నా తమ్ముడు చిరంజీవి బాలసుబ్రహ్మణ్యంకు ఆశీస్సులు ” అని వేసారు. ఈ సినిమా ద్వారా సంగీత ఔన్నతాన్ని, వైశిష్ట్యాన్ని చాటి చెప్పారు. ఈ సినిమా ద్వారా తొలిసారి జాతీయ అవార్డు దక్కించుకున్నారు. నేను బాధపడేది తిండిలేని రోజున కాదు, నేను పాడలేని రోజున అని అద్భుతమైన డైలాగ్‌ చెప్పించారు.

ఎటువంటి సినిమా అయినా అది విశ్వనాథ్‌ దర్శకత్వం వహిస్తే చాలు సూపర్‌ హిట్‌ అవుతుంది. అవార్డులు పంట పండిస్తుంది అని చాలా మంది భావిస్తారు. అయితే ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలి. నాన్‌ వెజిటేరియన్‌ హోటల్‌ వద్దకు వెళ్లి వెజిటేరియన్‌ ఫుడ్‌ మనం కోరుకోలేమని, ఆయనది ప్యూర్‌ వెజిటేరియన్‌ హోటల్‌ మాత్రమేనని ఆయన దగ్గర దానికి సంబంధించిన పదార్ధాలు మాత్రమే లభిస్తాయని, ఆయన టేస్ట్‌కు అనుగుణమైన సినిమాలు అయితేనే చేస్తానని పలు సందర్భాల్లో ఆయన వివరించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి వద్దకు వెళ్లి క్లబ్‌ సాంగ్‌ రాయమని ఎవరూ అడగరు కదా! అని ఒక సందర్భంలో విశ్వనాథ్‌ గారు ప్రస్తావించారు.

అవార్డులు – పురస్కారాలు : ప్రతిభ గల దర్శకుడైనందున కె.విశ్వనాథ్‌కు అనేక అవార్డులు, పురస్కారాలు వెదుక్కుంటూ వచ్చాయి. 5 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డులు, ఐదు నంది అవార్డులు, 10 ఫిలింఫేర్‌ అవార్డులు ఆయనను వరించాయి. భారతీయ సినిమాపై సి ఎన్‌ ఎన్‌ మరియు ఐబిఎన్‌ ప్రకటించిన అత్యంత ప్రతిష్టాత్మక 100 చిత్రాలలో శంకరాభరణంకు, సాగరసంగమంకు స్థానం లభించింది. విశ్వ విఖ్యాత దర్శక సార్వభౌమ అనే బిరుదును, చిత్తూరు నాగయ్య పేరిట గల పురస్కారాన్ని స్వీకరించిన విశ్వనాథ్‌కు లభించిన అవార్డుల వివరాలు ఇలా ఉన్నాయి.
1974లో ఓ సీత కథ చిత్రానికి గాను ఉత్తమ దర్శకునిగా ఫిలింఫేర్‌ అవార్డు కైవసం చేసుకున్నారు.

1975లో జీవనజ్యోతి చిత్రానికి గాను ఉత్తమ దర్శకునిగా ఫిలింఫేర్‌ అవార్డు కైవసం చేసుకున్నారు.
1980లో ప్రాచుర్యం పొందిన అత్యుత్తమ చిత్రంగా నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు సాధించారు
1981లో ఫ్రాన్స్‌ దేశంలో జరిగిన ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో శంకరాభరణంకు అవార్డు లభించింది
1982లో సప్తపది చిత్రానికి ఉత్తమ జాతీయ సమైక్యతా పురస్కారం(నర్గీస్‌దత్‌) లభించింది
1982లో శుభలేఖ చిత్రానికి గాను ఉత్తమ దర్శకునిగా ఫిలింఫేర్‌ అవార్డు కైవసం చేసుకున్నారు.
1983లో సాగరసంగమం చిత్రానికి గాను ఉత్తమ దర్శకునిగా ఫిలింఫేర్‌ అవార్డు కైవసం చేసుకున్నారు
1986లో స్వాతిముత్యం చిత్రానికి గాను గాను ఉత్తమ దర్శకునిగా ఫిలింఫేర్‌ అవార్డు కైవసం చేసుకున్నారు.
1986లో స్వాతిముత్యం చిత్రానికి గాను ఉత్తమ దర్శకునిగా నంది అవార్డు లభించింది.
1987లో స్వాతిముత్యం చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం లభించింది
1987లో శృతిలయలు చిత్రానికి గాను గాను ఉత్తమ దర్శకునిగా ఫిలింఫేర్‌ అవార్డు కైవసం చేసుకున్నారు.
1987లో శృతిలయలు చిత్రానికి గాను ఉత్తమ దర్శకునిగా నంది అవార్డు లభించింది.
1989లో ఈశ్వర్‌ అనే హిందీ చిత్రానికి గాను ఉత్తమ కథను అందించినందులకు ఫిలింఫేర్‌ అవార్డు సాధించారు.
1990లో సూత్రధారులు చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం లభించింది
1992లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం స్వీకరించారు.
1992లో ఆపద్బాంధవుడు చిత్రానికి గాను గాను ఉత్తమ దర్శకునిగా ఫిలింఫేర్‌ అవార్డు కైవసం చేసుకున్నారు.
1992లో రఘుపతి వెంకయ్య పేరిట గల అవార్డును అందుకున్నారు
1994లో ఫిలింఫేర్‌ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని తీసుకున్నారు.
1995లో శుభసంకల్పం చిత్రానికి గాను ఉత్తమ దర్శకునిగా ఫిలింఫేర్‌ అవార్డు కైవసం చేసుకున్నారు.
1995లో శుభసంకల్పం చిత్రంలో నటనకు గాను ఉత్తమ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నంది అవార్డు స్వీకరించారు.
2000లో కలిసుందాం..రా చిత్రంలో నటనకు గాను ఉత్తమ సపోర్టింగ్‌ యాక్టర్‌గా నంది అవార్దు అందుకున్నారు.
2012లో విశ్వవిఖ్యాత దర్శక సార్వభౌమ బిరుదును పొందారు.
2012లో చిత్తూరు నాగయ్య స్మారక పురస్కారం లభించింది.
2005లో స్వరాభిషేకం చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం లభించింది
2014లో గామా యొక్క లైఫ్‌టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు లభించింది
2017లో దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని పొందారు.
2017లో ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌ వారిచే పురస్కారం
2017లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా సత్కరించారు.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌ను స్వీకరించారు.
2017 ఫిబ్రవరి 19న విశ్వనాథ్‌ గారి జన్మదినం నాడు విశ్వనాథ్‌ గారి సినీ, జీవిత విశేషాలపై విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన రచయిత సముద్రాల గురుప్రసాద్‌ రాసిన కళాతపస్వి పుస్తకాన్ని విశ్వనాథ్‌గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌ ప్రధాన కార్యదర్శి మద్దాళి రఘురామ్‌ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ పుస్తకావిష్కరణలో సినీ విజ్ఞాన విశారద ఎస్‌ వి రామారావు గారు, ప్రముఖ సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు తదితరులు పాల్గొన్నారు.

కొసమెరుపు : విశ్వనాథ్‌ గారి సినిమాలు సంగీత భాండాగారాలు, విలువల వేదాలు.సంగీత స్వరాన్ని తెలుగువారికి వరంగా శంకరాభరణం ద్వారా ఆయన అందించారు.మనిషి విలువల నుంచి జనించిన సప్తపది పవిత్రతను వివరించారు. కళల కలయికతో ”సాగరసంగమం”, కల్మషం లేని ప్రేమతో ” స్వాతిముత్యం”, కళ యొక్క వైశిష్ట్యంతో ” స్వర్ణకమలం” స్వర ప్రవాహ సిద్ధమైన ”స్వరాభిషేకం” శృత్వమైన సరిగమల ”శృతిలయలు” ఆయన దర్శకత్వ ప్రతిభకు పట్టంగట్టాయి. మానవ సంబంధాల విశిష్ట కోణాన్ని సప్తపది చిత్రం ద్వారా ఆవిష్కరించారు. కులమతాలు మనిషికే తప్ప మనసుకు, కళకు కాదని చాటిచెప్పారు.సిరిసిరిమువ్వతో తన స్ధాయిని తెలిపిన కె.విశ్వనాథ్‌ను శంకరాభరణం శిఖరాగ్రానికి చేర్చింది. ఆయన కీర్తికిరీటంలో సిరివెన్నెల ఒక మణిమకుటం వంటిది. వారి సినిమాల్లో సంగీత సాహిత్యాలకు సముచిత గౌరవం లభిస్తుంది. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ హీరోయిజానికి దూరంగా సందేశాత్మక విలువలతో సాగినవే. మానవత శృతి కావాలి, మమత పల్లవి గావాలి, శాంతి స్వరం గావాలి, సౌభ్రాతృత్వం భావం కావాలి అనే కోరికతో మొదలైన విశ్వనాథ్‌ గారి సినీప్రయాణం అద్భుతంగా అప్రతిహతంగా కొనసాగుతోంది. హీరోయిజంతో కొట్టుకు పోతున్న తెలుగు సినిమాకు విశిష్ట కథాగమనాన్ని పరిచయం చేసి కొత్త శకానికి నాంది పలికిన దర్శక దిగ్గజం మన వెండి తెర కాన్వాసుపైన తన సృజనాత్మక కుంచెతో అద్భుత కథా కథన వర్ణాలతో అపురూప చిత్రాలను చిత్రించిన మహా చిత్రకారుడుగా గుర్తింపు పొందారు.తెలుగు సినీకేతనాన్ని అంతర్జాతీయ వినువీధుల్లో కనువిందుగా ఎగురవేసిన లబ్దప్రతిష్టుడు, ప్రేక్షక హృదయాల్లో సుప్రతిష్టుడు… సినీమాధ్యమానికి ఒక శృతిని ఒక లయను సమకూర్చిన కళాతపస్వి విశ్వనాథ్‌ గారికి నమస్కరిస్తూ…

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.