టీకా వేసుకోవడం వల్ల వచ్చే ప్రమాదాలకు ఎలాంటి భీమా వర్తించదని ఇన్సూరెన్స్‌ కంపెనీ సంస్థలు ప్రకటిస్తూనే ఉన్నాయి. టీకా వల్ల ఏర్పడే ఆరోగ్య సమస్యలకు బీమా కవర్‌ ఉంటుందా లేదా అన్నదానిపై మాత్రం చాలామందికి స్పష్టత లేకపోవడం వల్ల కొవిడ్‌-19 టీకా తీసుకున్న తర్వాత దానివల్ల ఏమైనా తేడా వచ్చి ఆస్పత్రిలో చేరాల్సి వస్తే ఆ ఖర్చు ఎవరికీ వారే భరించాలి అన్న ఉద్దేశ్యంతో టీకా కేంద్రాలకు వచ్చి టీకా తీసుకొనేవారు ఎంతో మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) దీనిపై స్పష్టత ఇచ్చింది. కొవిడ్‌-19 టీకా తీసుకున్న తర్వాత దానివల్ల ఏమైనా తేడా వచ్చి ఆస్పత్రిలో చేరాల్సి వస్తే.. అందుకయ్యే ఖర్చులు ఆరోగ్య బీమా పాలసీల కింద కవర్‌ అవుతాయని గురువారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

తీసుకున్న పాలసీలోని నియమ నిబంధనలకు లోబడి కవరేజీ ఉంటుందని ‘పాలసీల్లో చేసే మార్పుల వల్ల చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాలు పెరిగేటట్లయితే, అటువంటి మార్పులు చేయొద్దు’ అని, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలకు, ప్రయాణ బీమా పాలసీలకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది. ఆ మార్పులను పాలసీదార్లకు తెలియజేయాలని, అటువంటి మార్పులకు అదనపు ప్రీమియం వసూలు చేయరాదని తాజాగా నిర్దేశించింది. ఈ ప్రకటనతో పాలసీదారుల్లో వ్యక్తం అవుతున్న సందేహాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టినట్లు అయింది.