అంగారకుడిపై గతంలో ఎప్పుడైనా జీవులు మనుగడ సాగించి ఉంటే.. వాటి అవశేషాలను వెలికి తీసే ఉద్దేశంతో ప్రయోగించిన పర్సెవరెన్స్‌.. అంగారక గ్రహంపై తన కదలికలకు సంబంధించిన ధ్వనులను భూమికి పంపింది. ఈ రోవర్‌లో రెండు మైక్రోఫోన్లు ఉన్నాయి. అందులో ఒకటి.. ఇప్పటికే అక్కడి గాలి శబ్దాన్ని, రాళ్లపైకి లేజర్లను ప్రయోగించినప్పుడు వెలువడిన ధ్వనులను రికార్డు చేసింది. అంగారకుడిపై కాలుమోపే సమయంలో ఉత్పన్నమయ్యే శబ్దాలను రికార్డు చేయడానికి రెండో మైక్రోఫోన్‌ను ఇంజినీర్లు ఏర్పాటు చేశారు. అయితే ల్యాండింగ్‌ సమయంలో అది పనిచేయలేదు కాని అంగారకుడిపై రోవర్‌ కదిలే సమయంలో వెలువడిన ధ్వనులను నమోదు చేసింది. రోవర్‌లోని ఆరు లోహపు చక్రాలు, సస్పెన్షన్‌ వ్యవస్థ నుంచి వెలువడిన ధ్వనులను అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) తాజాగా విడుదల చేసింది. భూమి మీద ప్రమాణాలతో పోలిస్తే అవి చాలా ఆందోళనకర శబ్దాలని… అందులో పిండిమర శబ్దం, తీవ్రమైన కీచు ధ్వని, కర్ణకఠోరమైన పెద్ద శబ్దం వంటివి ఇందులో ఉన్నాయని పరిశోధకులు తెలిపారు.