వార్తలు (News)

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన!!

తూర్పు, మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ సముద్ర మట్టం నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తులో ఉంది. ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపునకు తిరిగి ఉన్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోని ఉత్తర ఒడిశా- పశ్చిమ బెంగాల్ తీరం వద్దకు చేరుకునే అవకాశం ఉండడంతో దీని ఫలితంగా తెలంగాణలో శనివారం (నేడు) పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు, రేపు ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రస్తుతం తెలంగాణకు పశ్చిమ దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్కువ ఎత్తులో పశ్చిమ, నైరుతి గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావం వల్ల రాబోయే మూడు రోజుల పాటు ఏపీలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఇవాళ, రేపు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

దక్షిణ కోస్తాంధ్రలో ఈరోజు, రేపు, ఎల్లుండి ఒకటి లేదా రెండు ప్రదేశాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, రాయలసీయలో కూడా మరో మూడు రోజులపాటు ఒకటి రెండు ప్రదేశాల్లో మోస్తరు లేదా తేలికపాటి జల్లులు కురుస్తాయని పేర్కొంది. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, గోదావరి జిల్లాల్లో ఇవాళ (ఆదివారం), రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •