ప్రపంచంలోనే మొట్టమొదటి సంక్షిప్త సందేశం (SMS)ను వేలం వేస్తామని, నాన్ ఫింగీబుల్‌ టోకెన్‌ (NFT) రూపంలో దీనికి వేలం నిర్వహిస్తామని వొడాఫోన్‌ ప్రకటించింది. ‘ఇది వొడాఫోన్‌ తొలి ఎన్‌ఎఫ్‌టీ ఏలియన్‌ మాన్‌స్టర్‌. తొలి ఎస్‌ఎంఎస్‌ను టెక్ట్స్‌ను మేం నాన్‌ ఫంగీబుల్‌ టోకెన్‌గా మార్చి వేలం వేస్తూ వచ్చిన మొత్తాన్ని వలసజీవులకు విరాళంగా ఇస్తాం’ అని వొడాఫోన్ గ్రూప్‌ ప్రకటించింది.

వొడాఫోన్‌ నెట్‌వర్క్‌ ద్వారా తొలి సందేశాన్ని 1992, డిసెంబర్‌ 3న పంపించగా ఈ సందేశాన్ని సంస్థ ఉద్యోగి రిచర్డ్‌ జార్విస్‌ అందుకున్నాడు. ఆ సందేశంలో ‘మెర్రీ క్రిస్‌మస్‌’ అని 15 అక్షరాలు ఉన్నాయి. అయితే ప్యారిస్‌లోని అగాటిస్‌ సంస్థ 2021, డిసెంబర్‌ 21న ఈ ఎన్‌ఎఫ్‌టీని వేలం వేయనుంది. మొట్టమొదటి ఎస్‌ఎంఎస్‌ను కేవలం ఒకసారి మాత్రమే మింట్‌ చేస్తామని, భవిష్యత్తులో మరోసారి ఈ సందేశాన్ని ఎన్‌ఎఫ్‌టీగా మింట్‌ చేయబోమని వొడాఫోన్‌ స్పష్టం చేసింది.

ఈ ఎన్‌ఎఫ్‌టీని కొనుగోలు చేసిన వ్యక్తికి దాని గుర్తింపును ధ్రువీకరిస్తూ ఓ ధ్రువీకరణ పత్రం దానిపై వొడాఫోన్‌ గ్రూప్‌ సీఈవో నిక్‌ రీడ్‌ సంతకం చేస్తారు. ఈ ఎన్‌ఎఫ్‌టీ వేలం ద్వారా రెండు లక్షల డాలర్లకు పైగా డబ్బు వస్తుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. వచ్చిన డబ్బును ప్రపంచవ్యాప్తంగా ఉన్న 82.4 మిలియన్ల మంది వలస జీవుల కోసం యూఎన్‌ రెఫ్యూజీ ఏజెన్సీకి అందించనున్నట్టు వెల్లడించింది.