కరోనా మహమ్మారి కారణంగా పలు కంపెనీలు వర్క్‌ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించాయి. కరోనా కొత్త వేరియంట్‌లు విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఇప్పటికీ కొన్ని కంపెనీలు ఈ సదుపాయాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఉద్యోగులకు శాశ్వతంగా ‘వర్క్‌ ఫ్రం హోం’ కొనసాగించే దిశగా కేంద్రం ఆలోచిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ‘పర్మనెంట్‌ వర్క్‌ ఫ్రం హోం’కు సంబంధించి కేంద్ర కార్మిక శాఖ కొత్త నియమ నిబంధనలను తీసుకు రావచ్చని సంబంధిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది అదేంటంటే ఈ విధానంతో ఉద్యోగుల వేతనాలపై ప్రత్యక్ష ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. దానికి తోడు పన్ను భారం కూడా కొంతమేర పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.

పర్మనెంట్‌ వర్క్‌ ఫ్రం హోం కోరుకునే వారికి వేతనాలను సవరించేందుకు కేంద్రం అనుమతి ఇవ్వవచ్చని, ఈ ఉద్యోగులకు హౌస్‌ రెంట్‌ అలవెన్స్‌ తగ్గవచ్చని, మౌలిక సదుపాయాల వ్యయం కింద రీ ఎంబర్స్‌మెంట్‌ పెరగవచ్చు కూడా. ఇంటినుంచే పని చేస్తుండడం వల్ల విద్యుత్తు, వైఫై, ఇతర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వ్యయాలు పెరుగుతాయి కాబట్టి వీటిని రీఎంబర్స్‌మెంట్‌లో చేర్చే అవకాశమున్నట్లు సమాచారం.

ఉద్యోగులు శాశ్వత వర్క్‌ ఫ్రం హోం కింద మెట్రో నగరాల నుంచి టైర్‌ 2, టైర్‌ 3 పట్టణాలకు వెళితే దానికి అనుగుణంగా కాంపన్సేషన్‌ ప్యాకేజ్‌ ఉండాలని కంపెనీలు భావిస్తున్నాయి. ప్రభుత్వం ఇలాంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని, త్వరలోనే కొత్త నిబంధనలను ఖరారు చేయవచ్చని సమాచారం.

శాశ్వతంగా ‘వర్క్‌ ఫ్రం హోం’ కోరుకునే ఉద్యోగుల వేతన నిర్మాణం మారుతుందని, హెచ్‌ఆర్‌ఎ, ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌ వంటి వాటిల్లో మార్పులు చోటుచేసుకుంటాయని టీమ్‌లీజ్‌ కాంప్లియన్స్‌ అండ్‌ పే రోల్‌ ఔట్‌సోర్సింగ్‌ బిజినెస్‌ హెడ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రశాంత్‌ సింగ్‌ వెల్లడించారు. ఉద్యోగులు మెట్రో నగరాల నుంచి నాన్‌ మెట్రో పట్టణాలకు రాకపోకలు సాగిస్తే హెచ్‌ఆర్‌ఎ తగ్గుతుందని, ఆ క్రమంలో టేక్‌ హోం (పేయబుల్‌) వేతనం తగ్గుతుందని చెబుతున్నారు. హెచ్‌ఆర్‌ఎలో మార్పు వల్ల ఆదాయపు పన్నుపై కూడా ప్రత్యక్షంగా ప్రభావం పడనుంది.

హెచ్‌ఆర్‌ఎ తగ్గింపు వల్ల పన్ను భారం పెరుగుతుందని, అలాగే తగ్గిన హెచ్‌ఆర్‌ఎ.. మూలవేతనాలకు జత అయితే అప్పుడు ప్రావిడెంట్‌ ఫండ్‌ కంట్రిబ్యూషన్‌ పెరుగుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కానీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కాస్ట్‌, రీఎంబర్స్‌మెంట్‌కు కలిసిన పక్షంలో పన్ను భారం కొంత మేర తగ్గే అవకాశముంటుందని అంచనా వేస్తున్నారు.

‘శాశ్వతంగా వర్క్‌ ఫ్రం హోం అంశంపై ఉద్యోగవర్గాల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు 80 శాతం మంది ఉద్యోగులు సానుకూలంగా స్పందించగా, 20 శాతం మంది మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కానీ వర్క్‌ ఫ్రం హోం తో ఉద్యోగుల సమర్ధతతోపాటు, అటు కంపెనీల ఉత్పాదకత కూడా అనూహ్యంగా పెరుగుతాయని కొందరు నిపుణులు వాదిస్తుండగా, కార్యాలయాలకు వెళ్ళి పనిచేస్తేనే ‘టీం వర్క్‌’ ప్రభావముంటుందని మరికొందరు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఉద్యోగవర్గాల నుంచి కేంద్రం అభిప్రాయాలను సేకరించినట్టు సమాచారం. పూర్తిగా వర్క్‌ ఫ్రం హోం కాకుండా… వారానికి మూడు రోజులపాటు వర్క్‌ ఫ్రం హోం ఉండేలా ఆదేశాలు జారీ కావచ్చని కూడా అభిప్రాయం వ్యక్తమవుతోంది.