చలికాలంలో అనేక ఆరోగ్యసమస్యలు చుట్టుముట్టటం సర్వ సాధారణం. సాధారణంగా ఈ కాలంలో దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు ఉత్పన్నమౌతాయి. ఈ క్రమంలోనే చలి నుంచి తట్టుకోవడంతోపాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కూడా అవసరం. చలికాలంలో ఇంట్లో అందుబాటులో ఉండే కొన్ని రకాల వస్తువులను ఉపయోగిస్తే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి కూడా బయట పడవచ్చు. అవేంటో చూద్దామా..

దాల్చిన చెక్కలో ఉన్న యాంటీ సెప్టిక్ లక్షణాల వల్ల రోజూ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులను రాకుండా చూస్తుంది. అలాగే శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. దాల్చిన చెక్క చిన్న ముక్కను తీసుకుని నీటిలో వేసి మరిగించి ఆ డికాషన్‌ను రోజుకు ఒక్కసారి తాగితే సరిపోతుంది.

యాలకుల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. యాలకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని రోజుకు ఒక్కసారి తాగితే చాలు, చలికాలంలో వెచ్చగా ఉండడంతోపాటు అనారోగ్యాలు రాకుండా చూసుకోవచ్చు. పాలలో యాలకుల పొడి కలిపి రాత్రి నిద్రించే ముందు కూడా తాగవచ్చు.

వెల్లుల్లి రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగు పరిచి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గాయాలను మానేలా చేయడంలో సహాయ పడుతుంది. శరీరంలో ఉండే సూక్ష్మ క్రిములను చంపుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ఉదయం పరగడుపున రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను అలాగే తింటే శరీరానికి వెచ్చదనం కూడా లభిస్తుంది.

లవంగాలు, తమలపాకు రసం, అల్లం రసాన్ని తేనె తో కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని సేవించిన వెంటనే జలుబు తగ్గుతుంది. కఫంతో కూడిన జలుబుతో ఇబ్బంది పడుతున్నవారు మిరియాలను వేయించి పొడి చేసుకుని అర టీ స్పూన్ చొప్పున మూడు నాలుగు రోజుల పాటు ఉదయాన్నే తీసుకుంటే జలుబు తగ్గిపోతుంది.

చలికాలంలో పసుపును ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా శరీరం వెచ్చగా ఉంటుంది. ఇది యాంటీ బయోటిక్‌గా పనిచేసి గాయాలు, పుండ్లను త్వరగా మానేలా చేస్తుంది. దగ్గు, జలుబు, జ్వరం తగ్గుతాయి. రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలుపుకుని తాగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది.