మనామా: కరోనా తీవ్రత తగ్గకపోవటంతో మరో మూడు వారాలు పాటు కవిడ్ ఆంక్షలు పొడిగించింది బహ్రెయిన్ ప్రభుత్వం. నియంత్రణకు ఏర్పాటైన నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్… దేశం లో వైరస్ తీవ్రత, వ్యాప్తి వేగంపై రివ్యూ చేసింది. గల్ఫ్ దేశాల్లో మహమ్మారి ప్రభావం కొనసాగుతుండటం మరియు బహ్రెయిన్లోనూ వ్యాప్తి తీవ్రత కనిపిస్తుండటంతో ఈ నెల 7 నుంచి అమలులోకి తీసుకొచ్చిన ఆంక్షలను మరో మూడు వారాలు కొనసాగించాలని నిర్ణయించింది బహ్రెయిన్ ప్రభుత్వం. సమాజ ఆరోగ్య భద్రత కోసం మరో 21 రోజులు దేశ పౌరులు, ప్రవాసీయులు తమ సూచనలను తప్పనిసరిగా పాటించాలని టాస్క్ ఫోర్స్ నిర్దేశించింది. ఎంత కఠినంగా నిబంధనలు పాటిస్తే అంత మేరకు వైరస్ వ్యాప్తిని నియంత్రించొచ్చని వెల్లడించింది. ఈ మూడు వారాల పాటు ఇండోర్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్, స్పోర్ట్స్ హాల్స్ తో పాటు రెస్టారెంట్, కేఫ్ లలో డైనింగ్ పై నిషేధం కొనసాగుతుంది. సోషల్ గ్యాదరింగ్స్ పై పరిమిత నిబంధనలు ఉంటాయి. చివరికి ఇళ్లలో కూడా 30 మందికి మించి ఎక్కువ మంది గ్యాదర్ కాకుడదు. ఔట్ డోర్ ఎక్సర్ సైజ్ ప్రాంతాల్లో కూడా 30 మందికి మించి అనుమతి ఉండదు. ప్రభుత్వ ఉద్యోగుల్లో 70 శాతం మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించాల్సి ఉంటుంది.