షార్జా: కోవిడ్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయటంతో పాటు ప్రజల్లో కూడా అవగహన పెంచేందుకు షార్జా ప్రభుత్వం అత్యవసర, విపత్తుల నిర్వహణ బృందం ముమ్మర చర్యలు చేపడుతోంది. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ సోషల్ గ్యాదరింగ్ కాకుండా అంతర్గత మంత్రిత్వ శాఖలోని భద్రతా విభాగానికి చెందిన ఎయిర్ వింగ్ సహాయం తీసుకుంటోంది. భద్రతా విభాగానికి చెందిన డ్రోన్లకు లౌడ్ స్పీకర్లను అమర్చి షార్జాలోని 35 చోట్ల కోవిడ్ నిబంధనలపై ప్రచారం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో డ్రోన్ల ద్వారా నిబంధనల ఉల్లంఘనలపై నిఘా కూడా కొనసాగిస్తున్నారు. ఇక పోలీస్ పాట్రోలింగ్ బృందాలతో నేరుగా ప్రచారాన్ని కొనసాగిస్తోంది షార్జా ప్రభుత్వం. పారిశ్రామిక ప్రాంతాలు, మసీదులు, నగర శివార్లు ఇలా మొత్తం 35 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని నిఘాతో పాటు ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తోంది. ఇక శుక్రవారం ప్రార్థనలకు ముందు, తరువాత పాట్రోలింగ్ పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకొని సోషల్ గ్యాదరింగ్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎయిర్ వింగ్ బృందం డ్రోన్ల సాయంతో పలు ప్రాంతాలపై నిఘా పెట్టి ఫోటోలను తీస్తున్నారు. డ్రోన్ల ద్వారా సేకరించిన సమాచారం నేరుగా షార్జా పోలీస్ కేంద్ర కార్యాలయానికి వెళ్తుంది. ఫోటోల ఆధారంగా ఏ ప్రాంతాల్లో రద్దీ ఉంది, ఎక్కడ నిబంధనల ఉల్లంఘన జరుగుతుందో గుర్తించి పాట్రోలింగ్ పోలీసులను సెంట్రల్ ఆపరేషన్స్ ఆఫీస్ అలర్ట్ చేస్తుంది. వెంటనే పాట్రోలింగ్ టీం ఆయా ప్రాంతాలకు చేరుకునేలా చర్యలు తీసుకున్నారు.