పెద్దపల్లి:  న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు హత్యపై స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎక్కడికి వెళ్లలేదని, ముఖం చాటేయలేదని తెలిపారు. విచారణ పూర్తయ్యాక హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెడుతానని ప్రకటించారు. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు కుట్రలను తిప్పికొడతామని హెచ్చరించారు. తాను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దగ్గరికి వెళ్లలేదని, వారిని అపాయింట్‌మెంట్ అడగలేదని తెలిపారు. ఒక బీసీ జెడ్పీ చైర్మన్ కావడాన్ని జీర్ణించుకోలేక విష ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. పోలీసులను విచారణ చేయనిస్తారా.. లేక శ్రీధర్‌బాబు చేస్తారా? అని పుట్ట మధు ప్రశ్నించారు.

కొంత మంది మీడియా ప్రతినిధులకు పుట్ట మధు సూటి ప్రశ్నలు వేశారు. ‘‘మా దగ్గర డబ్బులు లేకుంటే మమ్మల్ని బదనాం చేశారు. శ్రీధర్‌బాబు కోట్ల రూపాయలు ఇస్తూ హైదరాబాద్‌లో మీడియాను మేనేజ్ చేస్తే నాకు వ్యతిరేకంగా, ఆయనకు మద్దతుగా కథనాలను రాస్తారా? మీడియా రేటింగ్‌ల కోసం నాకు అన్యాయం చేస్తారా’’ అని పుట్ట మధు ప్రశ్నించారు.

హైకోర్టు న్యాయవాది వామనరావు దంపతుల హత్య కేసులో సూత్రదారి పుట్ట మధునే అని ప్రచారం జరుగుతోంది. స్థానిక రాజకీయాల నుంచి వచ్చిన మధు.. లోకల్ పాలిటిక్స్‌లో పట్టు సాధించేందుకు అడ్డు వస్తున్న వారిపై సామదాన దండోపాయ విద్యను పాటించేందుకు వెనుకాడడనే చర్చ జోరుగా సాగుతోంది. న్యాయవాదుల హత్య.. పుట్టా మధు రాజకీయ జీవితంపై మచ్చ పడేల చేశాయి.