హైదరాబాద్/మంగళ్‌హాట్ : ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనంలో ఎన్నికల కోడ్‌లో ప్రచారానికి వెళ్తే కిలోమీటర్‌కు రూ. 38 చొప్పున చెల్లించాలని అధికారులు ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఇచ్చిన నోటీసుల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. నోటీసులపై రాజాసింగ్ స్పందిస్తూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో అగ్గి మీద గుగ్గిలం ఐయ్యారు. ఇంటలిజెన్స్ విభాగం అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే తనకు ప్రాణహాని ఉందని, ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించిందన్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్తే కిలో మిటర్కు రూ.37 చొప్పున చెల్లించడంతో పాటు డ్రైవర్‌కు రూ.100 ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు నోటీసులివ్వటమేమిటో అర్థంకావడం లేదన్నారు. తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం డోర్ వేస్తే లాక్‌పడి తెరుచుకోవడం లేదని, ఎప్పుడు నడుస్తుందో… ఎప్పుడు ఆగిపోతుందో తెలియదని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం మంత్రులకు కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయించి తనకు మాత్రం డొక్కు వాహనం కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేసారు. అదే విధంగా తనకు కేటాయించిన వాహనం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు కొనుగోలు చేసిన వాహనం అని ఆయన అన్నారు. రూల్స్‌లో భాగంగానే నోటీసులు పంపినట్లైతే తాను సంబంధిత మొత్తాన్ని చెల్లిస్తానని ఆయన పేర్కొన్నారు.