ఒకప్పుడు విశాఖ అంటే 50 శాతం అడవే అన్న సంగతి ముందుతరాల వారికి తప్ప ఈ తరం వారికి తెలియదు. కానీ ఇదే నిజం. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని 11 మండలాల్లో అనేక గిరిజన తెగలు ఉండటం ఆశ్చర్యంగానే ఉంటుంది. కొన్ని తెగల గిరిజనులు వ్యాపారం కోసం లేదా విడిది కోసం కూడా వారు ఉండే ప్రాంతాలకు దూరంగా విశాఖకు దగ్గరగా వచ్చేవారని ఏయూ చరిత్ర విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లూరి సూర్యనారాయణ చెప్పారు. “జమీందార్ల కాలంలో మైదాన జమీందార్లు, కొండ జమీందార్లు అని ఉండేవారు. గిరిజన తెగల్లో ఉండే పెద్ద తెగలవారు కొండ జమీందార్లు వీరు కొండల్లో దొరికే వస్తువులతో వ్యాపారం చేసేందుకు మైదాన ప్రాంతాలకు వస్తుండేవారు. అలా వచ్చిన వీరు కొందరు మైదాన ప్రాంతాలకు సమీపంగా ఉండే అటవీ ప్రాంతాల్లో వ్యవసాయం అటవీ ఉత్పత్తుల సేకరణకు వీలు ఉంటుందని తాత్కలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని, తరాలు గడుస్తున్న కొద్దీ వారు మైదాన ప్రాంతాల ప్రజలతో కలిసిపోయారు.

ఇక విషయంలోకి వద్దాం. విశాఖ నగరం నడిబొడ్డున ఓ గిరిజన గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు శంభువానిపాలెం. ఇది కంబాలకొండ అభయారణ్యంలో ఉండడంతో వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం ఇది పూర్తిగా అటవీశాఖ అధ్వర్యంలో ఉంది. విశాఖ ఒకప్పుడు పెద్ద వ్యాపార కేంద్రం మరియు ఎక్కువ అడవులున్న ప్రాంతం కావడంతో శంభువానిపాలెం గిరిజనులు అలా వచ్చినవారై ఉంటారు” అని సూర్యనారాయణ చెప్పారు. శంభువానిపాలెం వెళ్లాలంటే చెక్ పోస్టు వద్ద అటవీశాఖ సిబ్బంది అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఊరిలో నివసించేవారు ఎవరైనా ‘మావాళ్లే’ అని చెప్తే అన్ని వివరాలు తీసుకుని లోపలికి అనుమతిస్తారు.

చెక్ పోస్టు నుంచి రెండు కిలోమీటర్లు ప్రయాణం చేసిన తరువాత శంభువానిపాలెం గ్రామం కనిపిస్తుంది. గ్రామంలోకి వెళ్తుండగానే తుమ్మిగెడ్డ రిజర్వాయర్, అది దాటగానే సెల్ ఫోన్ సిగ్నల్ కట్ అయిపోతుంది. ఈ గ్రామం జీవీఎంసీ పరిధిలో ఉండటంతో చెక్ పోస్టు నుంచి గ్రామం వరకూ తారురోడ్డు వేశారు. ఇక్కడ చేపలు పట్టడం, వన్యప్రాణులను వేటాడటం, తుపాకీ ఉపయోగించడం, చెట్లు తగలబెట్టడం, చెత్త వేయడం, మద్యం తాగడం, రిజర్వాయర్‌లో ఈతకొట్టడం వంటి పనులు చేయకూడదు. అది వన్యప్రాణి చట్టం సెక్షన్ 51 ప్రకారం నేరం. నగరపరిధిలో ఉన్న ప్రత్యేకమైన గ్రామం ఇది” అని విశాఖపట్నం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ అనంత్ శంకర్ చెప్పారు.

గ్రామంలో ప్రాథమిక పాఠశాల, అంగన్ వాడీ కేంద్రం తప్పితే ఇక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ నే కాదు ఆసుపత్రి కూడా లేదు. ఇది మరొక ప్రపంచం.ఈ ప్రపంచంలోకి రావడానికి ఎవరు ఇష్టపడరు అని అక్కడి గ్రామస్తులు చెప్తూ ఉంటారు. ఎవరితో అయినా ఈ గ్రామస్తులు ఫోన్ లో మాట్లాడడానికి కూడా సిగ్నల్ ఉండకపోవడంతో వీలు కాదు. కేవలం ఆ ప్రదేశంలో ఎత్తైన తుమ్మిగెడ్డ రిజర్వాయర్ ఎక్కి చూసినప్పుడు ఫోన్ లో సిగ్నల్ కనిపించగానే వారి ముఖంలో ఆనందం కనిపిస్తుంటుంది. అదీ ఆ ఊరి చరిత్ర.