వార్తలు (News)

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ

కరోనా రెండో దశలో మనదేశంలో రోజురోజుకూ కేసులు పైపైకి ఎగబాగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 10,60,971 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే వారిలో 40,953 పాజిటివ్ కేసులు వెలుగుచూడడంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1.15 కోట్లకు పైబడింది. నిన్న 188 మంది మృత్యు ఒడికి చేరగా, నిన్నటివరకు 1,59,558 మంది ప్రాణాలు వదిలారు. ఆక్టివ్ కేసులు 2,88,394కి పెరిగాయి. నిన్న ఒక్కరోజే 23,653 మంది వైరస్ నుంచి కోలుకోవడంతో మొత్తంగా వైరస్‌ను జయించిన వారి సంఖ్య 1,11,07,332కి చేరగా, రికవరీ రేటు 96.26 శాతంగా ఉందని శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ వివరాలను వెల్లడించింది.

జనవరి 16 నుండి కరోనా టీకా కార్యక్రమం సజావుగా సాగుతున్న క్రమంలో మార్చి ఒకటిన రెండో దశను కూడా ప్రారంభించింది. మార్చి 19 నాటికి 4,20,63,392 మందికి ప్రభుత్వం టీకాలు సరఫరా చేసింది. నిన్న ఒక్కరోజే 27,23,575 మంది వరకు టీకాలు వేయించుకున్నారు.

మహారాష్ట్రలో శుక్రవారం రికార్డు స్థాయిలో 25,681 కొత్త కేసులు నమోదవ్వడంతో కరోనా ఎంత ఉగ్రరూపం ధరించిందో తెలుస్తుంది. మొదటి దశ కంటే రెండో దశలో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. మార్చి 14 నుంచి ఆరు రోజుల వ్యవధిలో ఒక్క ఆర్థిక రాజధానిలోనే 13,912 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలడంతో దీని తీవ్రతను కట్టడి చేసే క్రమంలో కంటైన్‌మెంట్ జోన్లు, సీల్‌ చేసిన భవనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. మార్చి 18 నాటికి 34 కంటైన్‌మెంట్‌ జోన్లు ఉండగా, 305 భవనాలను బీఎంసీ సీల్ చేసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.