తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శుక్రవారం తెల్లవారుజామున ఎల్విన్‌పేటలో సిలిండర్‌ లీకై మంటలు వ్యాపించగా వృద్ధురాలు సజీవ దహనమైన ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం ల్విన్‌పేటలో ఒంటరిగా నివాసముంటున్న పల్లా లక్ష్మి(65) పాల ప్యాకెట్లు విక్రయిస్తూ, కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే శుక్రవారం వేకువజామున 4.15 గంటల ప్రాంతంలో పాల ప్యాకెట్లు సర్దుకుని టీ చేసేందుకు స్టౌ వెలిగించగా గ్యాస్‌ లీకై మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఆమె, ఇంటి తలుపులు తెరిచేందుకు తాళం చెవి వెతుకుతుండగానే సిలిండర్‌ పేలింది.

లక్ష్మి ఇంట్లో ఇటీవల రూ.10 వేలు చోరీ జరగడంతో చెక్క తలుపు ఏర్పాటు చేసుకుని దానికి సైకిల్‌ చైన్‌ బిగించి, తాళం వేసుకుంటున్నారు. ఆ తలుపు లేకుంటే ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉండేది. అసలే పూరిల్లు కావడంతో మంటలు ఇంటిని వేగంగా చుట్టుముట్టగా ఆమె సజీవ దహనమైంది. ఈ క్రమంలో పక్కనే ఉన్న మరో రెండిళ్లకు మంటలు వ్యాపించడంతో అవీ కాలిపోయాయి. ఈ ఘటనలో సుమారు రూ.10 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక అధికారులు వెల్లడించారు.

లక్ష్మికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉండగా వారందరికీ వివాహాలు అవ్వడంతో వేరుగా ఉంటున్నారు. ఆ వృద్ధురాలి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చేందుకు కూడా ఎవరూ మందుకు రాకపోవడంతో రెండో పట్టణ ఎస్సై సంతోష్‌కుమార్‌, కానిస్టేబుల్‌ నాగరాజు స్వయంగా తీసుకొచ్చి అంబులెన్స్‌లోకి ఎక్కించారు.