బ్రెయిన్‌ డెడ్‌ అయిన ఓ వ్యక్తి నుంచి మొదటి సారిగా చర్మాన్ని సేకరించి ఉస్మానియా ఆస్పత్రిలో భద్రపర్చడంతో పాటు దాత నుంచి రెండు మూత్రపిండాలు, రెండు కార్నియాలు సేకరించి బాధితులకు అమర్చారు.

అతని అవయవాల దానం వల్ల నలుగురు వ్యక్తులకు పునర్జన్మ లభించింది. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలకు చెందిన కాసా రఘునాథ్‌రెడ్డి(48)ని ఈ నెల 13న నల్గొండ జిల్లా చింతపల్లి వద్ద ద్విచక్రవాహనం ఢీకొట్టగా ఈ ప్రమాదం లో ఆయన తీవ్రంగా గాయపడడంతో నగరంలోని హస్తినాపురంలో ఉన్న ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి, అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించారు. కానీ వైద్యానికి ఆయన స్పందించకపోవడంతో వైద్యులు ఈ నెల 16న బ్రెయిన్‌ డెడ్‌గా నిర్ధారించారు.

తరువాత జీవన్‌దాన్‌ సభ్యులు రఘునాథ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడంతో కుటుంబ సభ్యులు అంగీకరించగా అతని నుంచి అవయవాలు సేకరించి బాధితులకు ఏర్పాటు చేశారు. మిగిలిన అవయవాలు మార్పిడి సాధారణమేగాని బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి నుంచి చర్మాన్ని సేకరించడం ఇదే మొదటి సారి అని జీవన్‌దాన్‌ నిర్వాహకులు తెలిపారు.