ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఈరోజుతో ముగియనుంది. దీంతో చివరి రోజు భారీగా ప్రలోభాలకు తెరలేపారు బరిలో నిలుస్తున్న అభ్యర్థులు..

కర్నూలు జిల్లాలో అయితే పోటీ పడి ఇంటికి కోళ్లు పంచుతున్నారు.. కొన్ని జిల్లాల్లో ఇంట్లో నాలుగు కన్నా ఎక్కువ ఓట్లు ఉంటే.. ఫ్రిడ్జ్ లాంటి వస్తువులు కొని ఇస్తున్నారు.

ఏపీలో పంచాయతీ ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. ప్రధాన పార్టీలు వైసీపీ, టీడీపీ మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. పార్టీల గుర్తులపై అభ్యర్ధులు పోటీ చేయకపోయినా.. తమ మద్దతు దారులు గెలిపించుకునేందుకు రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ లోనూ అనేక చోట్ల ఘర్షణలు చూశాం. పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు చాలా చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. బ్యాలెట్ బాక్సులు ఎత్తుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. దీంతో నాలుగో దశ పోలింగ్ కు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఒక్క ఓటరు కోరినా వీడియో రికార్డు చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయి.

ఆదివారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభం అయ్యే పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ముగియనుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 13 జిల్లాల్లోని 161 మండలాల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 3,299 పంచాయతీలు..

33,435 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా 553 పంచాయతీలు, 10,921 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరాంధ్రలో అధికంగా పోలింగ్ జరగనుంది.

ఎన్నికల ప్రచారానికి గడువు ముగియడంతో చివరి రోజు భారీగా ప్రలోభాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో తమకు ఇష్టమై బ్రాండ్లు దొరకకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించిన మద్యం బాటిళ్లను ఓటర్లు అడుగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో గత రెండు రోజుల నుంచి ఒడిశా, తెలంగాణల నుంచి భారీగా మద్యం దిగుమతి అవుతోంది. మరోవైపు శుక్రవారం సాయంత్రం వరకు ప్రచారం గడువు ఉండడంతో భారీగానే ఓటర్లకు గాలం వేశారు బరిలో నిలిచిన అభ్యర్థులు

ఓటు కోసం ఇంటికి మూడు కోళ్లు..


ఉప్పు తిన్నవాడు ఉపకారం చేస్తాడన్నది సామెత.. అయితే సర్పంచ్ బరిలో నిలిచిన అభ్యర్థులు మాత్రం కోడి తిన్నవాడు విశ్వాసం చూపరా అని లెక్కలు వేసుకుంటున్నారు. కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలో ఆదివారం నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 1737 మంది ఓటర్లు కలిగిన బాపురం పంచాయతీ. జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో బాపురంలో సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డ ఓ వర్గం అభ్యర్థి ఇంటికో కోడిని పంచారు.. హ్యాపీగా ఆ గ్రామస్థులంతా కోడిని కోసుకు తిన్నారు కూడా.. అయితే విషయం ప్రత్యర్థి వర్గానికి తెలియడంతో.. ఆ సర్పంచ్ అభ్యర్థి ఇంటికి రెండు కోళ్లను పంచారు. అప్పటికే కోడి కోసుకు తిన్న కొందరు.. ఆ రెండు కోళ్లను చికెన్ షాపు ఓనర్లకు ఇచ్చి.. తమకు అవసరమైనప్పుడు అడుగుతామంటూ కోళ్లను అక్కడ పెట్టినట్టు తెలుస్తోంది.

కేవలం కర్నూల్లోనే కాదు పలు జిల్లాల్లో ఇదే పరిస్తితి.. ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే ఒక ఇంట్లో నాలుగుకన్నా ఎక్కువ ఓట్లు ఉంటే వారి ఇంట్లో ఏ సామాన్లు లేవో కనుక్కుని వాటిని కొని ఇస్తున్నట్టు తెలుస్తోంది. కొందరి ఇళ్లకు ఫ్రిడ్జిలు పంపిణీ చేసినట్టు ఫిర్యాదులు కూడా అందాయి. కొన్ని చోట్ల సర్పంచ్ అభ్యర్థులైతే హామీ పత్రాలు కూడా ఇస్తున్నారు.. ఈ సారి ఓటేసి గెలిపిస్తే నాలుగు వారాలకు ఒకసారి డ్రైనేజీలు క్లీన్ చేస్తామని.. ఒక వేళ అలా క్లీన్ చేయని పక్షంలో తనను నిలదీయ వచ్చంటూ హామీ పత్రాలు కూడా ఇంటింటికీ ఇస్తున్నారు..

ఉత్రారాంధ్ర జిల్లాల్లో అయితే సోషల్ మీడియా వేదికగా ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల ప్రచారానికి గడువు ముగియడంతో ఇప్పుడు వాట్సప్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మాద్యమం ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇతర జిల్లాలు. రాష్ట్రాలను ఉన్నవారిని రప్పించేందుకు కూడా భారీగా ఖర్చు చేస్తున్నారు.