బంజారాహిల్స్‌: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు తెలంగాణకు చెందిన ఒక్క క్రీడాకారుడిని కూడా ఎంపిక చేయకపోవడం పట్ల ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందరో క్రీడాకారులను అందించిన హైదరాబాద్‌ నుంచి క్రికెట్‌కు ఆటగాడిని ఎంపిక చేయకపోవడం పట్ల ఆ జట్టు యాజమాన్యాన్ని దుయ్యబట్టారు. హైదరాబాద్‌కు చెందిన ఆటగాడు లేకుండా అది హైదరాబాద్‌ జట్టు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.

ఇప్పటికైనా పునరాలోచించి స్థానిక క్రికెటర్లను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు ఎంపిక చేయకపోతే త్వరలో ఉప్పల్‌లో జరగనున్న ఐపీఎల్‌ మ్యాచ్‌లను అడ్డుకుంటామని హెచ్చరించారు. మిగతా అన్ని జట్లు తమ ప్రాంతం వారికి అవకాశం కల్పిస్తే ఎస్‌ఆర్‌హెచ్‌ మాత్రమే విదేశీ, ఇతర రాష్ట్రాల ఆటగాళ్లకు అవకాశం ఇచ్చిందని, ఇది చాలా బాధాకరమన్నారు.