బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణలో రూపొందుతోన్న చిత్రం ‘గాలి సంపత్`. అనిల్ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ వహిస్తుండడంతో సినిమాకి స్పెషల్ క్రేజ్ వచ్చింది. వరుసగా ఐదు సూపర్హిట్లు ఇచ్చిన అనిల్ రావిపూడి పర్యవేక్షణలో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా `గాలి సంపత్` రూపొందుతోంది. అనిల్ కో డైరెక్టర్, రైటర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాతగా ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ హీరో శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరోహీరోయిన్లుగా నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ `గాలి సంపత్`గా టైటిల్ రోల్ పోషిస్తున్నఈ మూవీకి అనీష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ మహా శివరాత్రి కానుకగా మార్చి11న గ్రాండ్‌గా విడుదలవుతుంది. ఈ సందర్భంగా హైదారాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్రయూనిట్, పలువురు సినీ ప్రముఖులు పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. అనిల్ రావిపూడి ప్రెజెంట్స్ గాలి సంపత్. చాలా కొత్తగా ఉంది. పటాస్ నుంచి సరిలేరు నీకెవ్వరు వరకూ అనిల్ జర్నీ మీ అందరికీ తెలుసు. ఏ దర్శకుడైనా ఒక చిన్న సినిమాతో మొదలై సక్సెస్ సాధిస్తూ పెద్ద చిత్రాలకు దర్శకత్వం వహిస్తుంటారు. ఈ సమయంలో చిన్న సినిమాలను మర్చిపోతారు. మనం చరిత్ర చూసుకుంటే దాసరి నారాయణ రావు గారు, రాఘవేంద్ర రావు గారు, కోడి రామకృష్ణ గారు అందరూ పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా తీశారు. అందుకే వారు 100 సినిమాల మార్క్‌ను ఈజీగా దాటగలిగారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తున్నది. ఈ సమయంలో చిన్న సినిమాల వైపు పెద్ద దర్శకులు ఎవరు చూడడం లేదు. అది మారాలనే అనిల్ కి పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాకి కూడా నీ సహాయ సహకారాలు అందించమని చెప్పాను. అలా అనిల్ ఈ సినిమాను బ్యాక్ బోన్ గా నిలబడ్డారు.
మార్చి 11న విడుదల అవుతున్న గాలి సంపత్ తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది. ఒక పెద్ద దర్శకుడు పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా తీయాలి. ఎందుకంటే చిన్న సినిమాలకు ప్రేక్షకులు రావాలంటే ఆ సినిమాకు ఏదో ఒక ఎక్స్ ట్రా ఫోర్స్ ఉండాలి. ప్రతి పెద్ద డైరెక్టర్ కి ఒక మార్క్ ఉంటుంది అది యాడ్ అయినప్పుడు చిన్న సినిమాకూడా పెద్ద సినిమా అవుతుంది. అదేవిధంగా గాలి సంపత్ కూడా రేపు మార్చి 11న ఒక పెద్ద సినిమా అవుతుంది అని నమ్ముతున్నాను. దర్శకుడు అనీష్ దగ్గర కూడా ఒక మంచి కామెడీ టింజ్ ఉంది. ఆయన దర్శకత్వం వహించిన అలా ఎలా? సినిమా చూస్తున్నప్పుడు నేను కడుపుబ్బ నవ్వాను. రీసెంట్గా ఈ సినిమాలో కొన్ని ఎపిసోడ్స్ చూశాను చాలా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి.
అలాగే క్లైమాక్స్ చాలా ఎమోషనల్‌గా ఉంది. రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ని చాలా ఎక్స్ట్రార్డినరీగా పండించారు. థియేటర్ కి వచ్చే ప్రేక్షకులకు కావాల్సిన అనిల్ రావిపూడి, అనీష్ కృష్ణ మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి ఎమోషన్స్‌ని కూడా జోడించారు. షైన్ స్క్రీన్స్ నిర్మాతలు సాహూ, హరీష్ నాకు సన్నిహితులు. వారికి, ప్రొడ్యూసర్ గా పరిచయం అవుతున్న సాయి కృష్ణకు, అనిల్ రావిపూడికి ఆల్ ది బెస్ట్ అని ఆయన అన్నారు.