రాజకీయం (Politics)

తెలుగంటే మంత్రులు మాట్లాడే బూతు కాదు – చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన కొనసాగించడంపై మరోసారి స్పష్టమైన వివరణ ఇచ్చారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఆయన దీనికి వేదికగా వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను గౌరవించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మాతృభాషను ఆయన వారసత్వ సంపదగా అభివర్ణించారు. విదేశీయులను సైతం ఆకట్టుకున్న ఘనత తెలుగుభాషకు ఉందని అన్నారు.

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మాతృభాష అనేది.. ప్రతి ఒక్కరికీ పుట్టుకతోనే లభించే వారసత్వ సంపద అని చెప్పారు. శ్రీ కృష్ణదేవరాయల వంటి స్వదేశీయుల నుంచి సీపీ బ్రౌన్ వంటి విదేశీయులను కూడా తెలుగుభాష ఆకర్షించిందని చెప్పారు. అలాంటి భాషను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చులకనగా చూస్తోందని విమర్శించారు. ఇది దురదృష్టకరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఇంగ్లీష్‌లో విద్యాబోధనను కొనసాగించడానికి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని చంద్రబాబు మరోసారి పునరుద్ఘాటించారు. అయినప్పటికీ- ఇతర భాషలను నేర్చుకోడానికి పునాది మాతృభాషేనని, ఆ పునాదినే లేకుండా చేసి గాలిలో మేడలు కడతామని వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెబుతోందని అన్నారు. అలాంటి పాలకులను ఏమనాలని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యను ఏ మాధ్యమంలో చదువుకోవాలో ఎంచుకునే స్వేచ్ఛను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఉండాలన్నదే తెలుగుదేశం అభిమతమని స్పష్టం చేశారు.

తెలుగు మన మాతృభాష కావడం మనందరికీ గర్వకారణమని నారా లోకేష్ అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, మంత్రులకు తెలుగంటే బూతుగా వినిపిస్తోందని విమర్శించారు. మంత్రులు బూతులు మాట్లాడటానికి తప్ప, పిల్లలకు చదువు నేర్పించే మాధ్యమంగా పనికి రాదని జగన్ సర్కార్ భావిస్తోందని ఆరోపించారు. మాతృభాష అనేది మన మూలాలకు సంకేతమని నారా లోకేష్ అభివర్ణించారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా మన పిల్లలకు తప్పనిసరిగా తెలుగు భాషను నేర్పించడం తెలుగువారందరు తమ బాధ్యతగా గుర్తించాలని ఆయన సూచించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.