టాప్ స్టోరీస్ (Top Stories)

దూరం దగ్గరైంది..!

స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు కార్యాలయానికి, ప్రధాన వాణిజ్య కేంద్రానికి ఎంత దూరమని ఇదివరకు ఆలోచించేవారు. రహదారుల వంటి మౌలిక వసతులు మెరుగుపడటంతో ఎంత సమయంలో చేరగలమని ప్రస్తుతం ఆలోచిస్తున్నారు.

దీంతో దూరమైనా స్థిరాస్తి కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. స్థలాలు, ఫ్లాట్లు, విల్లాలు, ఫామ్‌ల్యాండ్స్‌ కొనుగోలు చేస్తున్నారు. నిర్మాణదారులు సైతం కొనుగోలుదారుల ఆలోచనలకు తగ్గట్టుగా ప్రాజెక్ట్‌లు చేపడుతున్నారు. ఓఆర్‌ఆర్‌ అంటే ఇదివరకు విల్లా ప్రాజెక్ట్‌లు ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు అపార్ట్‌మెంట్లు కనిపిస్తున్నాయి.  విల్లాల కోసం మరింత దూరమైనా వెళ్లేందుకు వెనకాడటం లేదు. నగరానికి ఎనిమిదివైపులా జాతీయ, రాష్ట్ర రహదారులు ఉండటం, ఇవన్నీ ఓఆర్‌ఆర్‌ అనుసంధానం కావడంతో దూరం సైతం దగ్గరైంది. శివారు ప్రాంతాలు పెట్టుబడుల కేంద్రంగా మారాయి. మెట్రో, ఎంఎంటీఎస్‌ విస్తరణ, ఫార్మాసిటీ ఏర్పాటు, ప్రాంతీయ వలయ రహదారి ప్రతిపాదనలన్నీ భవిష్యత్తుపై భరోసాని పెంచుతున్నాయి. మెరుగైన మౌలిక వసతులతో పెద్ద కంపెనీలు సైతం హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వరస కడుతున్నాయి. ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున అందుబాటులో ఉండటం కలిసివస్తోంది. ఇవన్నీ కూడా హ్యాపెనింగ్‌ హైదరాబాద్‌గా అడుగులు పడుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ కొనుగోలు చేస్తే భవిష్యత్తులో స్థిరాస్తి విలువ పెరుగుతుందని ఎవరి స్థాయిలో వారు పెట్టుబడి పెడుతున్నారు.


ఓఆర్‌ఆర్‌ వెంట..


ఇప్పటికే బాహ్యవలయ రహదారి వరకు నగరం.. ఓఆర్‌ఆర్‌ లోపలి వరకు నివాసాలు విస్తరించాయి. వ్యక్తిగత గృహాలు, విల్లా  ప్రాజెక్ట్‌లు దాటి ప్రస్తుతం బహళ అంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి. భూమి లభ్యత తగ్గడంతో క్రమంగా ధరలు పెరుగుతున్నాయి. దీంతో క్రమంగా ఓఆర్‌ఆర్‌ బయట అందుబాటు ధరల్లో ఉన్న స్థిరాస్తుల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఓఆర్‌ఆర్‌ లోపల నివాసాలకు డిమాండ్‌ ఉండగా..  బయట స్థలాలు, విల్లాలు కొనుగోలు చేస్తున్నారు.  విల్లాలను విస్తీర్ణాన్ని బట్టి రూ.కోటి నుంచి రూ.పాతిక కోట్ల వరకు విక్రయిస్తున్నారు.ఫార్మాసిటీలో..
ఒకవైపు శ్రీశైలం జాతీయ రహదారి.. మరోవైపు సాగర్‌ దారి మధ్యలో ఔషధనగరి వస్తోంది. దాదాపు 20వేల ఎకరాల్లో ఏర్పాటుకు సర్కారు చర్యలు చేపట్టింది. మొదటి దశలో దాదాపుగా భూసేకరణ పూర్తయింది. అంతర్గత రహదారులు వేస్తున్నారు. దశలవారీగా ఫార్మాసిటీ అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్ట్‌ ప్రకటనతో చుట్టుపక్కల పెద్ద ఎత్తున స్థిరాస్తి వెంచర్లు వెలిశాయి. కొత్తగా మరికొన్ని అభివృద్ధి చేస్తున్నారు. కొవిడ్‌కు ముందు, తర్వాత చూస్తే ఈ రెండు రహదారుల్లో స్థిరాస్తి లావాదేవీలు పుంజుకున్నాయి. ఫార్మాసిటీ రాకతో లక్షల మందికి ఉపాధి కేంద్రంగా ఈ ప్రాంతం మారనుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.  వీరందరికి సమీపంలోని చిన్న పట్టణాల్లో గృహ వసతి సరిపోదని.. పెద్ద ఎత్తున డిమాండ్‌ ఉంటుందని అంటున్నారు. భవిష్యత్తులో వృద్ధికి ఆస్కారం ఉంటుందని ఇక్కడ ప్రస్తుతం ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు.


ప్రాంతీయ వలయ రహదారితో..


హైదరాబాద్‌ ప్రధాన నగరం నుంచి నలువైపుల 50 కి.మీ. దూరంలోని పట్టణాలను కలుపుతూ ప్రాంతీయ వలయ రహదారితో అనుసంధానం పెంచాలనేది ప్రభుత్వం ఆలోచన. ఈ ప్రాజెక్ట్‌ ఆగిపోయిందనుకుంటున్న దశలో ఇటీవల తెరాస ఎంపీ ఒకరు ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్రం ఆమోదం తెలిపిందని వెల్లడించడంతో స్థిరాస్తి రంగంలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ ప్రాజెక్ట్‌ పేరుతో ఇప్పటికే పెద్ద ఎత్తున రియల్‌ వ్యాపారం సాగినా.. మధ్యలో కదలిక లేకపోవడంతో రియల్టర్లు నిరుత్సాహపడ్డారు. తాజా ప్రకటనతో భవిష్యత్తుపై అంచనాలు పెరిగాయి. రెండు దశల్లో 338 కి.మీ. మేర ప్రాంతీయ వలయ రహదారి ప్రతిపాదనలు ఉన్నాయి. సంగారెడ్డి, నర్సాపూర్‌, తూప్రాన్‌, గజ్వేల్‌, భువనగిరి, చౌటుప్పుల్‌, ఆమన్‌గల్‌, షాద్‌నగర్‌, చేవెళ్ల కంది వరకు వలయాకారంలో రహదారి రానుంది. ఇప్పటికే ఈ మార్గంలో ఉన్న రహదారులను విస్తరించనున్నారు. మౌలిక వసతుల పెంపుతో ఈ ప్రాంతాలు మరింతగా అభివృద్ధి చెంది ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఇప్పటికే పెద్ద ఎత్తున  స్థలాల, ఫామ్‌ల్యాండ్‌ వెంచర్లు ఉన్నాయి. చదరపు అడుగు రూ.4వేల నుంచి రూ.పదివేల వరకు చెబుతున్నారు. ఇక్కడ కొన్ని పట్టణాల్లో ధరలు హైదరాబాద్‌తో పోటీపడుతున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.