దిల్లీ: భారత్‌లో కొత్తగా నమోదవుతున్న కరోనా వైరస్‌ కేసుల్లో వరుసగా రెండో రోజు పెరుగుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో 6.70లక్షల పరీక్షలు చేయగా.. 14,264 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,09,91,651 కి చేరింది. కొత్తగా 11,667 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,06,89,715కు చేరి.. రికవరీ రేటు 97.25శాతంగా కొనసాగుతోంది.

ఇక మరణాల విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 90 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,56,302కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య  1,45,634 తగ్గింది. ఇక మరణాల రేటు 1.42 శాతంగా కొనసాగుతోంది. 

మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ సజావుగా సాగుతోంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 4.32లక్షల మందికి టీకా ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం టీకా అందిన వారి సంఖ్య 1,10,85,173కి చేరింది.