క్రైమ్ (Crime)

నాలుగు రోజుల ఉత్కంఠ… ఊహించని మలుపులు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్యోదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. ఉత్కంఠను రేపేలా గత నాలుగు రోజులుగా పోలీసుల విచారణ కొనసాగుతోంది. రాజకీయ కోణం బయటపడుతుండటం. చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో గడిచిన నాలుగు రోజుల్లో జిల్లాలో జరిగిన కీలక పరిణామాలు.. 

ఫిబ్రవరి 17

ఉదయం హైకోర్టు న్యాయవాదులు వామనరావు, నాగమణి దంపతులు మంథనికి 12.05 నిమిషాలకు వచ్చి కోర్టుకు వచ్చి తిరుగు ప్రయాణమయ్యారు. రామగిరి మండలం కల్వచర్ల వద్ద మధ్యాహ్నం 2.40కి వీరి కారును అడ్డగించిన ఇద్దరు వ్యక్తులు వేటకొడవళ్లతో దారుణంగా హత్య చేశారు.

నంబరు ప్లేటు లేని కారులో వచ్చి దాడి చేసిన ఇద్దరిలో ఒకరు కుంట శ్రీనుగా గుర్తించి అతడితో పాటు మరొకరి కోసం పోలీసులు విచారణ చేపట్టారు. కుంట శ్రీనుతోపాటు అనుచరులు కుమార్‌, వసంతరావుల ప్రోత్బలంతోనే హత్య జరిగిందని వామనరావు తండ్రి కిషన్‌రావు ఫిర్యాదు చేశారు. అనుమానితుల్లో కొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

ఫిబ్రవరి 18

లాయర్ల హత్య కేసును సుమోటాగా స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. 

కేసులో కుంట శ్రీనుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధు మేనల్లుడైన బిట్టు శ్రీను కత్తులు ఇచ్చాడని ఐజీ నాగిరెడ్డి చెప్పారు. కుంట శ్రీను, చిరంజీవితో పాటు మూడో నిందితుడు అక్కపాక కుమార్‌ను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు, భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు, ప్రజా సంఘాలు ఖండిస్తూ ధర్నాలతో నిరసన తెలిపారు. గుంజపడుగులో వామన్‌రావు దంపతులకు అంత్యక్రియలు జరిగాయి…

ఫిబ్రవరి 19

హత్యకు సహకరించేలా కారును, కత్తుల్ని సమకూర్చాడని పుట్టమధు మేనల్లుడు బిట్టు శ్రీనును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

పట్టుబడిన వారిని సాయంత్రం 6.30గంటల సమయంలో హత్యాస్థలానికి తీసుకెళ్లి సీన్‌ రీకన్స్‌స్ట్రక్షన్‌ చేశారు. తన కుమారుడు, కోడలు హత్య వెనుక రాజకీయ కోణం ఉందని కిషన్‌రావు చెప్పారు.

బిట్టు శ్రీనును పోలీసులు విచారించారు. రాత్రి 11 గంటలకు మెజిస్ట్రేట్‌ ముందు ముగ్గురు నిందితుల్ని హాజరుపర్చారు. వారికి 14 రోజులపాటు రిమాండ్‌ను విధించారు. 

ఫిబ్రవరి 20

సంఘటన స్థలాన్ని హైకోర్టు న్యాయవాదుల బృందం పరిశీలించింది… కీలక నిందితుడిగా ఉన్న బిట్టు శ్రీనును పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు.

రిమాండ్‌ చేసిన ముగ్గురు నిందితులు కుంట శ్రీను, కుమార్‌, చిరంజీవిలను కరీంనగర్‌ జైలులో ఒకే బ్యారక్‌లో మిగతా ఖైదీలతో పాటు ఉంచారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.