హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు, నాగమణి దంపతుల దారుణ హత్య తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అరెస్టయిన నిందితులు కుంట శ్రీనివాస్‌ (ఏ1), చిరంజీవి (ఏ2), అక్కపాక కుమార్‌ (ఏ3)లను పోలీసులు విచారిస్తున్న క్రమంలో మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తొలుత ఈ హత్యకు వామనరావు స్వగ్రామం పెద్దపల్లి జిల్లా గుంజపడగలో చోటుచేసుకున్న భూతగాదాలే ప్రధాన కారణమని ఐజీ నాగిరెడ్డి తెలిపారు. అయితే వామనరావు బంధువులు మాత్రం ఈ హత్య వెనక రాజకీయ ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను ఘటన స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేపట్టారు.

అలాగే నిందితులకు కారు, కత్తులు సమకూర్చిన ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనును కూడా పోలీసులు విచారిస్తున్నారు. నిందితులకు ఆయుధాలు సమకూర్చడం వెనక ఉన్న కారణాలపై అతన్ని విచారిస్తున్నారు. మరోవైపు బిట్టు శ్రీనుపై గతంలో రౌడీషీట్ ఉండగా.. 2013లో దానిని ఎత్తివేశారు.

ప్రస్తుతం కుంట శ్రీను, బిట్టు శ్రీను పోలీసులు విచారిస్తున్న సమయంలోనే సరికొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. కుంట శ్రీను, బిట్టు శ్రీనుల వల్ల తనకు ప్రాణ హాని ఉందని మంథని మాజీ వార్డు సభ్యుడు ఇనుముల సతీష్ ఆరోపించాడు. సతీష్ మీడయాతో మాట్లాడుతూ.. ” 018లో పుట్ట మధు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన అక్రమాస్తులపై హైకోర్టులో తాను కేసు వేశాను. ఆ కేసును వామన్‌రావు, ఆయన భార్య నాగమణి వాదించారు. ఆ కేసు వెనక్కి తీసుకోవాలంటూ కుంట శ్రీనివాస్‌, బిట్టు శ్రీనివాస్‌ నన్ను బెదిరించారు. కానీ అందుకు నేను ఒప్పుకోకపోవడంతో నన్ను హత్య చేసేందుకు సుపారీ మాట్లాడారు. కుంట శ్రీనివాస్‌ మాటలతో ఆడియో అప్పట్లోనే బయటకు రాగా అప్పటి డీజీపీ, రామగుండం పోలీస్‌ కమిషనర్‌కు అందించి ఫిర్యాదు చేశాను. కానీ పోలీసులు ఇప్పటివరకు దానిని తేల్చలేదు. తనతో పాటు నలుగురు వ్యక్తులను కుంట శ్రీను, బిట్టు శ్రీను లక్ష్యంగా చేసుకున్నారు. చివరకు వామన్‌రావును హత్య చేశారు. మిగిలిన ఇద్దరిలో ఒకరిపై పోలీసులతో పీడీ యాక్టును నమోదు చేయించారు. మరొకరిని లొంగదీసుకుని పార్టీలో చేర్చుకున్నారు. చివరకి నేను మిగిలాను. తనకు ప్రాణహాని ఉంది” అని ఆందోళన వ్యక్తంచేశారు.

Source