తమిళనాట మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనుండగా.. జైలు నుంచి విడుదలైన జయలలిత నెచ్చెలి వీకే శశికళ నిర్ణయంపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆమె ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోననేది ఆసక్తిగా మారింది. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి, జైలు శిక్ష ఖరారైన తర్వాత ఆమెను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించి, పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించి.. అన్యాయంగా తనను పార్టీ నుంచి తొలగించారని పేర్కొన్నారు. అయితే, ఆమె పిటిషన్‌ను సివిల్ కోర్టుకు హైకోర్టు బదిలీచేసింది.

చిన్నమ్మ పిటిషన్‌ను స్వీకరించిన సివిల్ కోర్టు.. విచారణను మార్చి 15కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌ను త్వరగా విచారించి తీర్పు వెలువరించాలని తాజాగా చెన్నై సివిల్ కోర్టును శశికళ ఆశ్రయించారు. ఇందులో తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వంను ప్రతివాదులుగా చేర్చారు. పళనిస్వామి, పన్నీర్‌సెల్వం, ఫారెస్ట్ సెక్రెటరీ దిండుగల్ శ్రీనివాసన్, తమిళనాడు మాజీ సెక్రెటరీ ఎస్ఎస్ సెమ్మాలయ్, అన్నాడీఎంకే అధ్యక్షుడు మధుసూధన్‌లకు పార్టీలోనే సభ్యత్వం లేదని ఆరోపించారు.

అంతేకాదు, ఆఫీసర్ బేరర్లుగా వారు తీసుకున్న చర్యలన్నీ రాజ్యాంగ విరుద్ధమని, పార్టీల నియమాలకు లోబడి లేవని పిటిషనర్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 24న పార్టీ ప్రముఖులతో శశికళ భేటీ కానున్నారు. జయలలిత జయంతి సందర్భంగా తొలిసారిగా ఆమె నేతలతో సమావేశం కానున్నారు. జైలు నుంచి విడుదలై చెన్నైకి తిరిగొచ్చిన శశికళ టి.నగర్‌లోని వదిన ఇళవరసి కుమార్తె కృష్ణప్రియ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. కరోనా నుంచి కోలుకున్న శశికళ.. వైద్య నిపుణుల సలహా మేరకు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. 

అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి దినకరన్‌ తరచూ ఆమెను కలుసుకుని రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చలు జరుపుతున్నారు. ఆ కేసు విషయమై ప్రస్తుతం శశికళ న్యాయనిపుణులు, తన తరఫు న్యాయవాదులతోనూ చర్చలు జరిపారు. జయ పుట్టిన రోజున పార్టీ ప్రముఖులు, తనకు తొలి నుంచి మద్దతు ఇస్తున్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో ఆమె సమావేశమవుతున్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత తన భవిష్యత్‌ రాజకీయ వ్యూహరచనలకు సంబంధించి ఆమె కీలక ప్రకటన చేయనున్నారు.