స్నేహితుని సోదరి ఇంట్లో చోరీకి పాల్పడిన ఇద్దరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను పులకేశినగర పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. లక్కసంద్ర నివాసి నజీం షరీఫ్, గుర్రప్పనపాళ్య మహమ్మద్‌ షఫీవుల్లా రియల్‌ ఎస్టేట్, గ్రానైట్‌ వ్యాపారాలు చేసి నష్టపోయారు. దీంతో ఎలాగైనా భారీగా డబ్బు సంపాదించాలనుకున్నారు. తమ స్నేహితుని సోదరి అయిన జ్యోతిజ్వాల ఇంట్లో చోరీకి పాల్పడ్డారు.

సేఫ్‌ లాకర్‌లో ఉన్న రూ.70 లక్షల విలువైన నగలు, నగదును బ్యాగులో వేసుకుని స్కూటీతో సహా పరారయ్యారు. జాడ దొరకరాదని అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలోని తమ ఇంటికి 7 ఆటోలు మారి 18 కిలోమీటర్లు చుట్టి వెళ్లారు. ఫిర్యాదు మేరకు తూర్పు విభాగపు డీసీపీ శరణప్ప, సీఐ ప్రదీప్‌ఎడ్విన్‌ దర్యాప్తు చేపట్టారు. 15–20 రోజుల పాటు చుట్టుపక్కల 270 కు పైగా సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించగా షరీఫ్, షఫీవుల్లాలే చోరీ చేసినట్లు గుర్తించి అరెస్టు చేసి సొత్తు సీజ్‌ చేశారు.