శాన్‌డిగో: అమెరికాలో ఆశ్రయం కోసం సరిహద్దులోని మెక్సికోలో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న శరణార్థులను దేశంలోకి అనుమతించే ప్రక్రియను అగ్రరాజ్యం శుక్రవారం నుంచి ప్రారంభించింది. తద్వారా ట్రంప్‌ హయాంలో చేపట్టిన వలస విధానాలకు ముగింపు పలికే దిశగా బైడెన్‌ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మెక్సికో వైపు నుంచి వలసదారులు అమెరికాలోకి ప్రవేశించకుండా ట్రంప్‌ కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. తొలి దశలో పరిమిత సంఖ్యలోనే శరణార్థులను అనుమతించనున్నారు. అమెరికాలోకి వచ్చేవారి సంఖ్యను సాధ్యమైనంత తగ్గించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ దేశంలోకి ప్రవేశించకుండా మెక్సికోలోనే ఉండాలంటూ శరణార్థులకు సూచిస్తున్నారు. అయినా అమెరికాలోకి రావాలనుకునేవారు వచ్చేవారం శరణార్థుల కోసం ఐక్యరాజ్య సమితి హైకమిషనర్‌ ప్రారంభించబోయే వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. అమెరికాలో ప్రవేశించేవారికి కరోనా పరీక్షలు నిర్వహించి పాజిటివ్‌గా తేలితే 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచనున్నారు.


ఇరాన్‌తో చర్చలకు సిద్ధం


వాషింగ్టన్‌: 2015లో జరిగిన టెహ్రాన్‌ అణు ఒప్పందం పునరుద్ధరణ కోసం ఇరాన్‌ సహా ప్రపంచ దేశాలతో చర్చలు జరిపే యోచనతో ఉన్నట్లు అమెరికా ప్రకటించింది. ట్రంప్‌ సర్కారు ఆ ఒప్పందం నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం 2025 కల్లా తమ అణు కార్యకలాపాలను గణనీయంగా తగ్గించుకోవడానికి ఇరాన్‌ అంగీకరించింది. ఇరాన్‌కు అణ్వాయుధాలను తయారు చేసుకునే వెసులుబాటును కల్పించేలా ఈ ఒప్పందం ఉందంటూ ట్రంప్‌ వాదించారు. కానీ బైడెన్‌ యంత్రాంగం మాత్రం ఇరాన్‌ ఆ ఒప్పందానికి కట్టుబడటానికి అంగీకరిస్తే తిరిగి అందులో చేరతామని ప్రకటించింది.