న్యూఢిల్లీ: మొబైల్ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు వాటి స్వరూపాన్ని సమూలంగా మార్చివేస్తున్నాయి. ప్రస్తుతం ఇయర్ బడ్స్ నుంచి చార్జింగ్ వరకు అంతా వైర్‌లేకుండానే (వైర్‌లెస్) పని జరిగిపోతోంది. యాపిల్, శాంసంగ్‌తో పాటు కొన్ని చైనీస్ మొబైల్ మేకర్లు కూడా వైర్‌లెస్ చార్జింగ్ టెక్నాలజీని అందిపుచ్చుకోగా, ఇప్పుడు యాపిల్ మరో అడుగు ముందుకు వేసింది. ఫోన్‌కు బ్యాక్‌ కవర్‌ను అమర్చడం ద్వారా బ్యాటరీ లైఫ్‌ను పెంచే సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. ‘బ్యాటరీ ప్యాక్’గా పిలిచే ఇవి ఫోన్ బ్యాక్ కవర్‌లా ఉంటాయి. వీటి ద్వాారా వైర్‌లెస్ చార్జింగ్ చేసుకోవచ్చు.

అయస్కాంతాన్ని జతచేసిన ఈ బ్యాటరీ ప్యాక్‌లపై యాపిల్ ఏడాది కాలంగా పనిచేస్తోంది. ఐఫోన్ 12 సిరీస్‌లో వచ్చే తర్వాతి ఫోన్ల చార్జింగ్‌కు వీటిని ఉపయోగించుకోవచ్చు. అలాగే, కొత్త ఫోన్లు, కేస్‌లను కూడా దీనితో చార్జింగ్ చేసుకోవచ్చు. మెగాసేఫ్ విధానాన్ని ఉపయోగించి ఈ బ్యాటరీ ప్యాక్‌లను ఐఫోన్12కు వెనకవైపు జతచేస్తారు. 

గత ఐఫోన్ల కోసం అందుబాటులో ఉన్న యాపిల్ బ్యాటరీ యాడ్-ఆన్స్‌కు ఇది పూర్తిగా భిన్నం. ఇది అదనంగా బ్యాటరీ లైఫ్‌ను ఇచ్చేందుకే. అంతేకానీ, పూర్తిస్థాయి రక్షణ కేస్‌లా ఉపయోగపడదు. పరీక్షల సమయంలో ఈ చార్జింగ్ కేస్‌లో వెలుగు చూసిన లోపాలను ప్రస్తుతం సరిదిద్దే పనిలో యాపిల్ ఉన్నట్టు తెలుస్తోంది.