అంతర్జాతీయం (International)

నిరసనకారులపై ఉక్కుపాదం సరికాదు: ఐరాస

వాషింగ్టన్‌: మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు శనివారం రక్తసిక్తంగా మారడాన్ని ఐక్యరాజ్యసమితి ఖండించింది. అక్కడి సైనిక పాలకులు ఆందోళనకారుల్ని అణచివేసేందుకు వారిపై ఉక్కుపాదం మోపడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఐరాస కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఆదివారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. మయన్మార్‌లోని మాండలేలో శనివారం ఆందోళనకారులపై సైన్యం కాల్పులు జరపగా.. ఇద్దరు మృతి చెందగా.. మరో 40 మంది గాయాలపాలవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. 

‘మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న పౌరులపై పాలకులు హింసాత్మక విధానాల్ని ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. శాంతియుతంగా నిరసనలు చేస్తున్న వారిని బెదిరింపులకు గురిచేయడం, వేధించడం ఆమోదయోగ్యం కాదు. శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు ప్రతిఒక్కరికీ ఉంటుంది. అన్నిపార్టీలు ఎన్నికల ఫలితాలను గౌరవించి.. తిరిగి పౌర పాలన నెలకొనేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని గుటెరస్‌ ట్వీట్‌లో వెల్లడించారు. 

మయన్మార్‌లో ఫిబ్రవరి 1న ఆంగ్‌సాన్సూ‌కీ నేతృత్వంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అక్కడ సైనిక పాలన అమల్లోకి వచ్చింది. దీంతో అప్పటి నుంచి ప్రజలు సైనిక పాలనను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఆంగ్‌సాన్‌ సూకీని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.