వార్తలు (News)

మంత్రికి రెండోసారి కరోనా: మహారాష్ట్రలో కొవిడ్‌ ఉగ్రరూపం

ముంబయి: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతుండటం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం అక్కడ రికార్డు స్థాయిలో 6వేలకు పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. దాదాపు మూడున్నర నెలల తర్వాత ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. 

రాష్ట్రంలో నిన్న 6,112 కొత్త కేసులు నమోదయ్యాయి. చివరిసారిగా అక్టోబరు 30న 6వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టిన వైరస్‌ ఇప్పుడు మళ్లీ విజృంభిస్తోంది. అకోలా, పుణె, ముంబయి డివిజన్‌లలో అత్యధిక కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,87,632కి చేరింది.

 నిన్న మరో 44 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 51,713గా ఉంది. ఓవైపు కేసులు పెరుగుతుండగా.. రికవరీల సంఖ్య పడిపోతూ ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం కేవలం 2,159 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 44,765 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

మంత్రి, మాజీ మంత్రికి రెండోసారి కరోనా..

ఎన్సీపీ నేత, మాజీ మంత్రి ఎక్‌నాథ్ ఖడ్సే, మహారాష్ట్ర జలవనరులశాఖ సహాయ మంత్రి బచ్చు కడు తాజాగా కరోనా బారిన పడ్డారు. అయితే వీరికి వైరస్‌ సోకడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఖడ్సేకు గతేడాది నవంబరులో కరోనా సోకగా.. తాజాగా మళ్లీ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఖడ్సే ప్రస్తుతం బాంబే హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక బచ్చు కూడా గతేడాది సెప్టెంబరులో కరోనా బారిన పడ్డారు. తాజాగా రెండోసారి వైరస్‌ సోకినట్లు మంత్రి ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. 

చలి వల్లే వైరస్‌ వ్యాప్తి..

రాష్ట్రంలో గత వారం ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయని, అందువల్లే వైరస్‌ వ్యాప్తి పెరిగిందని మహారాష్ట్ర సీనియర్‌ ఆరోగ్య అధికారి ఒకరు వెల్లడించారు. అంతేగాక, చాలా మంది నిబంధనలు ఉల్లంఘిస్తూ మాస్క్‌లు ధరించకపోవడం, సామాజిక దూరం పాటించకపోవడం కూడా వైరస్‌ విజృంభణకు కారణమవుతోందని వివరించారు. 

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.