ఉమ్మడి రాష్ట్రంలో అనేకసార్లు నీళ్ల పంచాయితీకి కేంద్రంగా మారిన రాజోళిబండ డైవర్షన్‌ స్కీం (ఆర్డీఎస్‌)పై మరోసారి వివాదం రాజుకొంటున్నది. ఆర్డీఎస్‌ హెడ్‌వర్క్స్‌ కుడివైపున ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి కాలువ నిర్మాణాన్ని ఆ ప్రాజెక్టుపై ఆధారపడిన తెలంగాణ రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ కాలువ నిర్మాణానికి ఏపీకి ఎలాంటి అనుమతులు లేవని అంటున్నారు. బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం 4 టీఎంసీల కృష్ణా జలాలను తుంగభద్రకు తరలించి వాడుకొనేందుకు మాత్రమే అవకాశం ఉన్నదని చెప్తున్నారు.  

మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/అయిజ : కర్ణాటకలోని ఆర్డీఎస్‌ ఆనకట్ట (రాజోళి బండ డైవర్షన్‌ స్కీం) కుడి వైపున ఏపీ సర్కారు రూ.1985.423 కోట్లతో నూతనంగా కాలువ నిర్మాణం చేపడుతున్నది. బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం తాము 4 టీఎంసీల నీటిని 160 కిలోమీటర్ల గ్రావిటీ కాలువ ద్వారా తరలించి 40 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అవకాశం ఉన్నదని చెప్తున్నది. ఈ కాలువ నిర్మాణానికి ఇప్పటికే పరిపాలనా అనుమతులిచ్చి టెండర్లు కూడా పిలిచింది. కాలువతోపాటు 4 లిఫ్టులు ఏర్పాటు చేసి అదనంగా మరో 5 లక్షల ఎకరాలకు నీటిని తరలించేందుకు ఏపీ సర్కారు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ కాలువ నిర్మాణానికి ఏపీకి ఎలాంటి అధికారిక అనుమతులు లేవని తెలంగాణ రైతులు అంటున్నారు. సీడబ్ల్యూసీ, అపెక్స్‌ కమిటీ, కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుతోపాటు కర్ణాటక, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల నుంచి అనుమతి లేదని చెప్తున్నారు. బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం 4 టీఎంసీల కృష్ణా జలాలను తుంగభద్రకు తరలించి వాడుకునేందుకు అనుమతి ఉంద ని పేర్కొంటున్నారు. ఏపీ మాత్రం కృష్ణా బేసిన్‌ నుం చి తమకు బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు మేరకు 4 టీఎంసీల కేటాయింపులున్నాయని పేర్కొంటూ కాలువ నిర్మాణం చేపట్టింది. మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాలకు సాగునీటిని అందించేందుకు ఈ కాలువ నిర్మిస్తున్నారు. 

మా గొంతెండుతుంది

ఏపీ చేపడుతున్న కాలువ నిర్మాణం వల్ల తెలంగాణలోని అలంపూర్‌ నియోజకవర్గంలో 100 గ్రామాల్లో తాగు నీటికి కటకట ఏర్పడుతుంది. ఆర్డీఎస్‌ ఆయకట్టు 87,500 ఎకరాలు, నదీ పరీవాహక ఆయకట్టు 4 లక్షల ఎకరాలు బీడుగా మారే ప్రమాదం ఉందని తెలంగాణ రైతాంగం ఆందోళన వ్యక్తంచేస్తున్నది. తుమ్మిళ్ల, గార్లపాడు, మద్దూరు, బుడమొర్సు ఎత్తిపోతల పథకాలకు చుక్కనీరు రాదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మిషన్‌ భగీరథకు సైతం నీటికి కటకట తప్పదని స్థానికులు వాపోతున్నారు.

ఏపీకీ నష్టమే

కొత్త కాలువ వల్ల ఏపీలో ఉన్న పలు నీటిపారుదల ప్రాజెక్టులకు నష్టమేననే వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీలో నదీ పరీవాహక ప్రాంతంలోని 150 గ్రామాలకు తాగునీరు, 5 లక్షల ఎకరాల సాగు భూమి నీటికి కటకట తప్పదని అంటున్నారు. సుంకేసులతోపాటు 20కిపైగా ఎత్తిపోతల పథకాలపై ఆర్డీఎస్‌ రైట్‌ కెనాల్‌ ప్రభావం పడుతుందని చెప్తున్నారు.  

ఆయకట్టు తెలంగాణలో.. హెడ్‌ వర్క్స్‌ కర్ణాటకలో..

ఆర్డీఎస్‌ ఆయకట్టు రైతులకు ముందు నుంచి సాగునీటి కష్టాలే. ఆయకట్టుకు నీటిని అందించే హెడ్‌ వ ర్క్స్‌ కర్ణాటకలోని మాన్వి తాలూకా రాజోళిబండ గ్రామం వద్ద ఉన్నాయి. అక్కడి నుంచి కాలువ ద్వారా మళ్లించిన నీరు కర్ణాటకలో 42.6 కిలోమీట ర్లు ప్రవహించి తెలంగాణలోకి ప్రవేశిస్తాయి. దీనిపై కర్ణాటకలో 12, తెలంగాణలో 38 డిస్ట్రిబ్యూటరీలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్డీఎస్‌ కాలువ పొడవునా సాగునీటి కష్టాలే ఉండేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తుమ్మి ళ్ల ఎత్తిపోతల పథకం చేపట్టి ఆర్డీఎస్‌ ఆయకట్టుకు అనుసంధానం చేసింది. దాంతో రైతుల కష్టాలు తీ రాయి. ఇప్పుడు ఏపీ రైట్‌ కెనాల్‌ నిర్మాణంతో అటు ఆర్డీఎస్‌ నుంచి కాలువ ద్వారా రావాల్సిన నీరు తగ్గుతుంది. నదిలో నీటి లభ్యత కూడా తగ్గి సుంకేసుల బ్యారేజీ నుంచి తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా సాగునీటిని ఎత్తిపోసే అవకాశం లేకుండా పోతుంది. అనుమతి లేని ఈ కాలువ నిర్మాణం వెంటనే ఆపాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.   

పనులు పూర్తిగా నిలిపివేయాలి

ఆర్డీఎస్‌ రైట్‌ కెనాల్‌ పనులను ఏపీ సర్కారు తక్షణమే నిలిపివేయాలి. ఇది ఒప్పందాలకు విరుద్ధంగా నిర్మిస్తున్న ప్రాజెక్టు. ఆర్డీఎస్‌పై ఆధారపడి గ్రామాలకు తాగునీటి అవసరాలతోపాటు అనేక లిఫ్టులు ఉన్నాయి. వీటన్నిటికీ తుంగభద్ర బోర్డులో నీటి వాటా ఉంది. ఎలాంటి నీటి హక్కులు లేకుండా కెనాల్‌ నిర్మిస్తే ఒప్పుకునేది లేదు. ఆర్డీఎస్‌ ఆయకట్టు రైతులు అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం నేతృత్వంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తాం. వారి ద్వారా సీఎం కేసీఆర్‌కు వివరించి ప్రాజెక్టు నిలిపివేసేలా ఏపీ సీఎం జగన్‌ను కోరతాం. అవసరమైతే సీడబ్ల్యూసీకి, సుప్రీం కోర్టుకైనా వెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్డీఎస్‌పై అక్రమంగా కాలువ నిర్మాణం చేపట్టనివ్వం. 

– సీతారాంరెడ్డి, ఆర్డీఎస్‌ మాజీ చైర్మన్‌