వార్తలు (News)

ఐదో టీ20లో ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా ఘన విజయం

మొతేరా వేదికగా జరిగిన ఇంగ్లాండ్‌తో జరిగిన ఆఖరి టీ20లో కోహ్లీసేన ఈ సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది. 2016 టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఇంగ్లాండ్‌పై అత్యధికంగా మూడుసార్లు పొట్టి సిరీస్‌ కైవసం చేసుకుంది. ఆ జట్టుపై ఈ రికార్డు నమోదు చేసిన తొలి టీమ్‌గా భారత్‌ ఘనత సాధించింది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా 224/2 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.‌ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ (64; 34 బంతుల్లో 4×4, 5×6), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(80నాటౌట్‌; 52 బంతుల్లో 7×4, 2×6) ప్రతిభావంతంగా ఆడారు. వీరిద్దరూ ఈ ఫార్మాట్‌లో తొలిసారి ఓపెనింగ్‌ చేసి ఇంగ్లాండ్‌ బౌలర్లపై గెలుపు సాధించారు. రోహిత్‌ క్రీజులో ఉన్నంతసేపు దూకుడుగా ఆడగా, కోహ్లీ నిలకడగా ఆడారు. అలా వీరిద్దరూ 9 ఓవర్లకే జట్టు స్కోరును 90 పరుగులు దాటించగా 94 పరుగుల వద్ద రోహిత్‌ ఔటయ్యాక గేమ్‌ మార్చిన కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌(32; 17 బంతుల్లో 3×4, 2×6), హార్దిక్‌ పాండ్య(37నాటౌట్‌; 17 బంతుల్ల్లో 4×4, 2×6)తో కలిసి జట్టుకు భారీ స్కోర్‌ అందించారు. ఆపై ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ జాస్‌ బట్లర్‌(52; 34బంతుల్లో 2×4, 4×6), డేవిడ్‌ మలన్‌(68; 46 బంతుల్లో 9×4, 2×6) రాణించినా ఇతర బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. చివరికి ఆ జట్టు 188/8తో సరిపెట్టుకొని ఓటమిపాలైంది.

పొట్టి క్రికెట్‌లో ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియాకు ఇదే అత్యుత్తమ స్కోర్‌ 224/2. 2007లో ఇదే జట్టుపై 218/4 స్కోర్‌ సాధించడంతో ఇది నాలుగో అత్యుత్తమ స్కోర్‌ కావడం విశేషం.

ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలన్‌ టీ20ల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తిచేసిన ఆటగాడిగా 24 ఇన్నింగ్స్‌ల్లో రికార్డు నెలకొల్పారు. అంతకుముందు బాబర్‌ అజామ్‌ 26, విరాట్‌ కోహ్లీ 27, ఆరోన్‌ ఫించ్‌, కేఎల్‌ రాహుల్‌ చెరో 29 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించారు.

ఇక కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు(1,502) సాధించిన ఆటగాడిగా 45 మ్యాచ్‌ల్లో ఈ రికార్డు చేరుకున్నారు. అంతకుముందు ఆరోన్‌ఫించ్‌ 44 మ్యాచ్‌ల్లో 1,462 పరుగులు, కేన్‌ విలియమ్సన్‌ 49 మ్యాచ్‌ల్లో 1,383 పరుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఒక టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగానూ కోహ్లీ కొత్త రికార్డు నమోదు చేశారు. ఈ సిరీస్‌లో అతడు మొత్తం 231 పరుగులు సాధించడంతో 2020లో న్యూజిలాండ్‌పై కేఎల్‌ రాహుల్‌ సాధించిన 224 పరుగుల రికార్డును అధిగమించారు. ఇక 2018లో కొలిన్‌ మన్రో వెస్టిండీస్‌పై 223 పరుగులు సాధించడంతో మూడోస్థానంలో ఉన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.