తెలంగాణలో గత వారం రోజులుగా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండడంతో మరోసారి లాక్ డౌన్ పెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. కానీ ఈసారి లాక్ డౌన్ పూర్తిస్థాయిలో కాకుండా పాక్షికంగా ఉంటుందని తెలుస్తోంది. స్కూళ్ల మూసివేతకు, సినిమా థియేటర్లు, జనాల రద్దీ ఉండే ప్రాంతాల్లో ఆంక్షలు విధించే ఆలోచనలో ఉన్నట్టు, కరోనాపై త్వరలో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది.

వీకెండ్స్‌లో లాక్‌డౌన్ విధించే అవకాశం ఉందని, వారంలో 3 రోజుల పాటు లాక్‌డౌన్ లేదా రాత్రిపూట కర్ఫ్యూపై కసరత్తు చేస్తున్నారు. కోవిడ్ అదుపులోనే ఉన్నా.. ప్రభుత్వం కట్టడి చర్యలు తీసుకోనుంది. తెలంగాణలో కేసుల సంఖ్య ఎంత పెరిగినప్పటికీ దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనే లక్ష కేసులు వచ్చినా చికిత్స అందించేందుకు మౌలిక సదుపాయాల కల్పన చేసుకున్నామని, ప్రస్తుతం అటువంటి పరిస్థితులు రాకపోవచ్చని, ఈ నెల 26 కంటే ముందే అసెంబ్లీ సమావేశాలు ముగించే యోచనలో సర్కార్ ఉందని అధికారులు అంటున్నారు.