ఉగాండాలోని క్వీన్ ఎలిజబెట్ నేషనల్ పార్కులోని అభయారణ్యంలో ఆరు సింహాలు చనిపోయి తలలు, పంజాలు నరికేసి ఉన్నాయి. వాటి శరీరాలు ముక్కలు ముక్కలుగా పడిఉండడంతో ఆ సింహాలపై ఎవరో విషప్రయోగం చేసి ఉంటారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాటి కళేబరాల పక్కనే చనిపోయిన రాబందులు కూడా కనిపించడంతో సింహాల మాంసం తిన్న రాబందులు చనిపోయాయి కాబట్టి వీటికి విషం పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు వన్యప్రాణులను అక్రమంగా తరలించే స్మగ్లర్లే కారణం అయ్యుండవచ్చని ఉగాండా వైల్డ్ లైఫ్ అథారిటీ అధికారులు చెప్పారు. అభయారణ్యంలోని ఈ సింహాలకు చెట్లు ఎక్కగలిగే సామర్థ్యం కూడా ఉంది. క్వీన్ ఎలిజబెత్ పార్కులో సింహాలకు విషం పెట్టి చంపిన ఘటనలు ఇంతకు ముందు కూడా చాలాసార్లు జరిగాయి. 2018 ఏప్రిల్లో 8 కూనల సహా 11 సింహాలు చనిపోయి కనిపించాయి. వీటికి కూడా విషం పెట్టారని అనుమానించారు. 2010లో కూడా ఇలాంటి ఘటనలో ఐదు సింహాలు చనిపోయాయి.