క్రైమ్ (Crime) వార్తలు (News)

జమ్మూకశ్మీర్‌ ఎన్‌కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం!!

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సొపోర్‌లో ఆదివారం సాయంత్రం ప్రారంభమై రాత్రంతా కొనసాగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా ఉగ్రముఠాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఎన్‌కౌంటర్‌ జరిగిన స్థలం నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

కశ్మీర్‌ పోలీసులు చాలాకాలంగా గాలిస్తున్న ముదాసిర్‌ పండిట్‌ అనే కమాండర్‌ స్థాయి ఉగ్రవాది ఈ ఎన్‌కౌంటర్‌లో హతమైనట్లు, పలువురి హత్యల్లో అతడి ప్రమేయం ఉన్నట్లు స్పష్టం చేశారు. ఎన్‌కౌంటర్‌లో హతులైన మరో ఇద్దరు కూడా లష్కరే తోయిబాలో కమాండర్‌ స్థాయి ఉగ్రవాదులేనని, వారిలో ఒకరిని ఖుర్షీద్‌ అహ్మద్‌ మిర్‌, మరొకరిని విదేశీ ఉగ్రవాదిగా గుర్తించినట్లు, సొపోర్‌కు చెందిన ఖుర్షీద్‌ అహ్మద్‌ మిర్.. మే, 2020 నుంచి లష్కరే తోయిబాలో పనిచేస్తున్నట్లు వెల్లడించారు. అతడు ఏడుగురు భద్రతాదళ సిబ్బంది, అయిదుగురు స్థానికులను హత్య చేసినట్లు తెలిపారు. ముదాసిర్‌ పండిట్‌తో కలిసి పలు హత్యలు, ఉగ్రదాడుల్లో పాల్గొన్నాడని వివరించారు.

మూడు నెలల్లో రెండు భారీ ఉగ్రదాడులు సంభవించడంతో సొపోర్‌లో వారి ఫొటోలతో పోస్టర్లు అతికించినట్లు కశ్మీర్‌ ఐజీ బిజయ్‌ కుమార్‌ తెలిపారు. వారి గురించి సమాచారం ఇచ్చిన వారికి బహుమతులు కూడా ప్రకటించడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో తమకు ఫోన్లు చేసి సమాచారం అందించగా వారిని ముట్టడించినట్టు తెలిపారు.ఈ సందర్భంగా స్థానికులకు కృతజ్ఞతలు చెప్పారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •