అంతర్జాతీయం (International) వార్తలు (News)

చైనాలో భారీ వరదలు.. నీటిలో తేలియాడిన కార్లు!!

చైనాలోని హెనన్‌ ప్రావిన్స్‌లో గత 1000ఏళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో భారీ వర్షాలు ముంచెత్తాయి. ప్రావిన్స్‌లో కుంభవృష్టి కురవడంతో భీకర వరదలు సంభవించాయి. ఈ వరదల్లో ఇప్పటివరకు కనీసం 12 మంది మృతిచెందగా లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

‘ఐఫోన్‌ సిటీ’గా పిలిచే ప్రావిన్స్‌ రాజధాని జెంగ్జౌలో మంగళవారం ఒక్కరోజే 457.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. శనివారం నుంచి ఇక్కడ సగటున 640.8 మి.మీల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో ఈ ప్రావిన్స్‌ను ఆనుకుని ఉన్న ఎల్లో నది ఉద్ధృతంగా ప్రవహించడంతో వరదలు సంభవించి లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలోకి వెళ్లాయి. వీధులు నదులను తలపిస్తున్నాయి. రోడ్లపై ఉండాల్సిన కార్లు నీటిపై పడవల్లా తేలియాడుతున్నాయి. ఇప్పటికే అనేక వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. హెనన్‌ వ్యాప్తంగా అనేక జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. జెంగ్జౌకు పశ్చిమాన ఉన్న యిహెతన్‌ డ్యామ్‌ ఏ క్షణానైనా కూలేలా ఉన్నట్లు తెలుస్తోంది.

రోడ్లపైకి వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. బస్సు, రైళ్ల సర్వీసులను,250కి పైగా విమానాల రాకపోకలను నిలిపివేశారు. జెంగ్జౌలోని ఓ సబ్‌వే టన్నెల్‌లోకి వరద నీరు భారీగా చేరడంతో అందులో నుంచి వెళ్తోన్న రైల్లోకి నీరు వచ్చింది. అనేక మంది రైల్లో చిక్కుకుపోగా సహాయకచర్యలు చేపట్టిన అధికారులు ప్రయాణికులను టన్నెల్‌ నుంచి బయటకు తీసుకొస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •